Kadapa TDP : కడపలో ఉప ముఖ్యమంత్రి సోదరుడి వీరంగం

కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడి ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయనితెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు పోలీసుల అండదండలతో దాడులకు పాల్పడటమే కాకుండా బూతు పురాణం వల్లెవేస్తూ... మహిళలను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి సోదరుడు అహ్మద్ బాషా వ్యవహారశైలి గ్యాంగ్ స్టర్ నయూమ్ తరహాలో ఉందని... అతన్ని వెంటనే నగర బహిష్కరణ చేయాలని తెలుగుదేశం నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
మంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా దౌర్జన్యాలు, దోపిడీలు తారాస్థాయికి చేరాయని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. గురువారం తెలుగుదేశం కడప ఇంఛార్జి మాధవీరెడ్డిపై అసభ్యకరంగా మాట్లాడిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఏడాది కిందట వినాయక్ నగర్ లో ఓ మైనారిటీ నాయకుడి స్థలాన్ని ఆక్రమించేందుకు అహ్మద్ బాషా తన అనుచరులతో హల్ చల్ చేయడం తీవ్ర దుమారం రేపింది. శుక్రవారం తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగగా తెదేపా కార్యకర్త అరీఫుల్లాపై పోలీస్ స్టేషన్ లోనే మంత్రి సోదరుడు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, అతని భార్య మాధవీరెడ్డిని ఉద్దేశిస్తూ ఇంటికి వచ్చి దాడి చేస్తాననిమళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానని రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా పోలీసులు మిన్నకుండిపోయారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీలో నమోదైందనిమంత్రి సోదరుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాధవీరెడ్డి, తెదేపా నేతలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు.
ఇటీవల ముద్దనూరులో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రెచ్చిపోయి తెదేపా నేతలను దూషిస్తూ, దాడులు చేయడం వివాదాస్పదమైంది. తెదేపా నేతలను లక్ష్యంగా చేసుకుని జిల్లాలో వైకాపా ఎమ్మెల్యేలు వరస దాడులకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెదేపా నేతలు తెలిపారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
వైకాపా నాయకుల దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను, ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారన్న తెదేపా నేతలు పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com