Ramayapatnam Port: పోర్టు నిర్వాసితుల ఆందోళన-
పునరావాసం కల్పించాలంటూ 5రోజులుగా రామాయపట్నం పోర్టు నిర్వాసితులు నిరసన బాట పట్టారు. హామీ ఇచ్చి రెండేళ్లు దాటిపోయినా ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోయారు. అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామంటూ భూములు, చేపల చెరువులను తీసుకుని... ఇప్పుడు తమని రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటుతో తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు.
సమస్యలు పరిష్కరించాలంటూ రామాయపట్నం నిర్వాసితులు చేపట్టిన ఆందోళన ఐదో రోజు కొనసాగింది. 5రోజులుగా పునరావాస ప్యాకేజీ కోసం కర్లపాలెం గ్రామస్థులు ధర్నా చేస్తున్నారు. రెండేళ్లుగా పునరావాసం కల్పించకుండా... R అండ్ R ప్యాకేజీ ఇవ్వకుండా... తమకు జగన్ సర్కార్ నరకం చూపిస్తోందని వాపోయారు. పంచాయతీలోని మిగిలిన రెండు గ్రామాలకు స్థలాలిచ్చి... తమకు మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయారు. ప్రభుత్వం దిగొచ్చి న్యాయం చేసేవరకు ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేశారు.
గతంలో ఒక్కో కుటుంబానికి ప్యాకేజీ కింద 9 లక్షల 91 వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 450 కుటుంబాలకు సుమారు 44 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. రెండేళ్లుకావస్తున్నందున అదనంగా 30శాతం పెంచి పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఐదు రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... దీక్షా శిబిరం వద్దనే వంటావార్పు చేస్తున్న మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఆందోళన చేస్తున్న గ్రామస్థులకు సంఘీభావం తెలిపారు. పోర్టు వద్దకు వెళ్లిన మహీధర్ రెడ్డి నిర్వాసితులను కలిశారు. పునరావాసం కల్పించకుండా పోర్టు పనులు ఎలా చేస్తున్నారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అధికారుల తీరుపై మండిపడ్డ మహీధర్ రెడ్డి పోర్టు కార్యాలయానికి తాళాలు వేయించారు. అనంతరం ఎండీ ప్రతాప్ కుమార్ రెడ్డితో నిర్వాసితుల ప్యాక్యేజీ గురించి ఫోన్ మాట్లాడారు. నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వకుంటే పనులను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

