TIRUMALA: వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడసేవ

TIRUMALA: వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడసేవ
X

కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమలలో శ్రీవారికి గరుడసేవ కన్నుల పండువగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుత్మంతుని మీద ఆలయ మాడ వీధుల్లో విహరించారు. గరుడి మీద ఊరేగిన వేంకటేశ్వరున్ని దర్శించుకున్న భక్తులు తరించిపోయారు. జ్ఞానవైరాగ్యాన్ని కోరే మానవులు.. జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుత్మంతున్ని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

కార్తీక మహా దీపోత్సవం

తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పరేడ్ గ్రౌండ్‌లో నవంబర్ 18 రాత్రి నిర్వహించనున్న కార్తీక మహాదీపోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జేఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. టీటీడీ హెచ్‌డీపీపీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక మహాదీపోత్సవంలో భక్తులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాలేని భక్తులు SVBCలో ప్రత్యక్షంగా వీక్షించాలని కోరారు. మహిళలు కూర్చొని సంప్రదాయ దీపాలు వెలిగించేందుకు దీపస్తంభాలు, నెయ్యి కుండలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ మొత్తం కార్పెట్ వేసి ప్రతి దీప స్తంభం వద్ద తులసి మొక్కను ఏర్పాటు చేస్తారు. కార్యక్రమం అనంతరం ఈ మొక్కలను మహిళలకు వృక్ష ప్రసాదంగా అందజేస్తారు. వేదికను పూలతో అలంకరించి, విద్యుద్దీపాలతో, వేదికకు ఇరువైపులా సెట్టింగులతో ఆధ్యాత్మిక భావాన్ని కలిగించనున్నారు. కార్యక్రమంలో భాగంగా జరిగే శ్రీ మహాలక్ష్మి పూజకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారాల నుంచి ప్రాంగణమంతా అరటిచెట్లు, పూలు, విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించనున్నారు.

Tags

Next Story