CMS MEET: సమస్యల పరిష్కారాని కమిటీ

CMS MEET: సమస్యల పరిష్కారాని కమిటీ
ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో నిర్ణయం.... రెండు వారాల్లో కమిటీ ఏర్పాటు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత పదేళ్ళలో పరిష్కారం కాని అంశాలపై చర్చించామన్న ఆయన... పెండింగ్ సమస్యలు అన్నింటికి ఈ సమావేశంలోనే పరిష్కారం లభిస్తుందని తాము అనుకోవట్లేదన్నారు. కానీ పరిష్కార మార్గలకు నిర్ణయం జరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఉన్నతాధికారులతో త్రిమెన్ కమిటీ వేయాలని నిర్ణయించామని... రెండు వారాల్లో ఈ కమిటీ ఏర్పాటు చేసి కొన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ వేస్తామన్న భట్టి... అధికారుల స్థాయిలో పరిష్కారం కానీ అంశాలను మంత్రుల స్థాయిలో పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రుల స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై మరోసారి సీఎంల స్థాయిలో భేటీ కావాలని నిర్ణయించామని వెల్లడించారు. యాంటి నార్కోటిక్ , సైబర్ క్రైం నియంత్రణ కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాలని నిర్ణయించామని భట్టి వెల్లడించారు. రెండు రాష్ట్రాల అడిషనల్ డీజీ స్థాయిలో ఈ సమన్వయం జరుగుతుందన్నారు.

కీలక అంశాలపై చర్చ

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. మహాత్మ జ్యోతిరావ్‌ పూలే ప్రజా భవన్‌లో జరిగిన ఈ భేటీలో ప్రధాన అంశాలపై చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, కందుల దుర్గేశ్‌, బీసీ జనార్దన్‌రెడ్డి పాల్గొననున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సహా కీలక అధికారులు ఈ కీలక భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, పాల్గొంటారు.

ముఖ్యమంత్రి సలహాదారులు వేంరెడ్డి నరేందర్‌రెడ్డి, వేణుగోపాల్‌ రావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆర్థికశాఖ కార్యదర్శి సహా ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో రేవంత్‌రెడ్డి పరిణతి ప్రదర్శించారు. హైదరాబాద్ లో కొన్ని భవనాలు ఇవ్వాలని చంద్రబాబు కోరినప్పటికీ ఇవ్వలేమని రేవంత్‌ సున్నితంగా నిరాకరించారు. విభజన సమస్యల పరిష్కారం.. నిధుల కేటాయింపు, నీళ్ల సమస్యలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వవ్యస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లోని సంస్థల అస్తుల పంపకాలపై ఇరువురు సీఎంలు చర్చించారు.

Tags

Next Story