KURNOOL: కర్నూలులో హైకోర్టు బెంచ్.. కీలక ముందడుగు

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థలం, వసతుల అధ్యయనం చేయాలని అధికారులకు కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా అదేశాలు జారీ చేశారు. హైకోర్టుకు కావాల్సిన స్థలం కోసం వసతుల అధ్యయనం చేశారు. అన్ని వసతులు ఉండే స్థలం కోసం అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు అనంతరం జిల్లా కలెక్టర్‌కు అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. దీనిపై ఇటీవల సమీక్ష నిర్వహించి బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హైకోర్టు సీజే అనుమతి తప్పనిసరి
హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం తప్పనిసరి. రాయలసీమలో అంతకుముందు చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. 2022లో జిల్లాల పునర్విభజన తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని 8 జిల్లాలుగా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.95 కోట్ల జనాభాలో రాయలసీమలోని 8 జిల్లాలో 1.59 కోట్ల మంది ఉన్నారు. ఇది ఏపీ జనాభాలో 25 శాతం కంటే ఎక్కువ.
ఎప్పటి నుంచో డిమాండ్
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈనాటిది కాదు. స్వాతంత్రానికి పూర్వమే 1937 నుంచి సీమ ప్రజలు హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేశారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా స్వప్నంగానే మిగిలిపోయింది. కర్నూలులో ‘హైకోర్టు బెంచ్’ ఏర్పాటు చేస్తాం అంటూ ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే కసరత్తు ప్రారంభించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు కూటమి ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభ ఆమోదం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com