వైసీపీ ఇన్‌చార్జ్ దాష్టికం.. మరో దళితుడిపై దాడి..

వైసీపీ ఇన్‌చార్జ్ దాష్టికం.. మరో దళితుడిపై దాడి..
ప్రకాశం జిల్లాలో మరో దళితుడిపై దాడి జరిగింది. కొండేపి నియోజవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ మాదాసి వెంకయ్య తనపై దాడి చేశాడంటూ వాసేపల్లిపాడు గ్రామ మాజీ సర్పంచ్, వైసీపీ జిల్లా ప్రధాన..

ప్రకాశం జిల్లాలో మరో దళితుడిపై దాడి జరిగింది. కొండేపి నియోజవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ మాదాసి వెంకయ్య తనపై దాడి చేశాడంటూ వాసేపల్లిపాడు గ్రామ మాజీ సర్పంచ్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంగుంట రవిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామ సమస్యలపై చర్చించేందుకు ఉలవపాడుకు రమ్మని, మాదాసి వెంకయ్య, రావూరి అయ్యవారయ్య తన మనుషులతో కొట్టించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

టంగుటూరు సొసైటీ ఛైర్మన్‌ రావూరి అయ్యవారయ్య, వాసేపల్లిపాడు మాజీ సర్పంచ్‌, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంగుంట రవిబాబు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఆ వివాదం పరిష్కరించుకునే సమయంలో మరో విషయంలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, గ్రామ సమస్యల పరిష్కారానికి అగ్రకులస్తుల ద్వారా చెప్పించుకుంటేనే పనులు చేస్తామన్నారని రవిబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. అవినీతిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమకేసులు పెట్టిస్తామని బెదిరించారని రవిబాబు వెల్లడించాడు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలంటూ ఉలవపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాదాసి వెంకయ్య, రావూరి అయ్యవారయ్య నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ లేఖలో పేర్కొన్నాడు.

ఈ వ్యవహారమంతా సింగారయకొండ సీఐ దగ్గరుండి చూస్తున్నారని రవిబాబు చెప్పాడు. అగ్రకులస్తుడితో చెప్పించకపోతే తనకు పనులు చేయరా అని నిలదీస్తే.. వెంకయ్య, అయ్యవారయ్యలతో పాటు ఆయన అనుచరులు తనపై భౌతికదాడి చేశారని ఆరోపించారు రవిబాబు. ఉలవపాడులో ఇన్‌ఛార్జ్‌ ఇంటి ముందే కొట్టారన్నారు. వెంటనే తప్పించుకొని ఒంగోలు ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లానన్నారు.

అటు మాదాసి వెంకయ్యపై వైసీపీ నేత రామారావు తీవ్ర ఆరోపణలు చేశారు. బ్లాక్‌ మెయిలింగ్‌ వ్యాపారవేత్తలకు లొంగిపోయి ఎంపీటీసీ స్థానాల్లో బీఫామ్‌లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ జిల్లా అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రామారావు ప్రకటించారు. పార్టీని నిర్వీర్యం చేయాలని టీడీపీ కోవర్టులు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి నాయకుల అంతం చూస్తామని రామారావు హెచ్చరించారు.

మొత్తంగా ఆ ఇద్దరు నేతల వల్ల ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దారుణంగా మారిపోతోందని మరో వర్గం నేతలు ఆరోపిస్తున్నారు.. అటు మాదాసి వెంకయ్య నుంచి తనకు ప్రాణహాని ఉందని.. గన్‌మెన్లను కేటాయించాలని ఉలవపాడు పోలీసులను కోరాడు రవిబాబు.

Tags

Read MoreRead Less
Next Story