KPL: కోట్ల జూదంతో కోడిపందేల ప్రీమియర్ లీగ్

సంక్రాంతి అంటే పల్లెల్లో పంట పండుగ… కానీ ఈసారి కోస్తా జిల్లాల్లో పండుగకు మరో అర్థం వచ్చింది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్‌కు ఏమాత్రం తీసిపోని హంగు, ఆర్భాటం, ఖర్చు… కానీ ఆట మాత్రం క్రికెట్ కాదు! ఫ్లడ్‌లైట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, డ్రోన్ కెమెరాలు, లగ్జరీ కారవాన్లు, వేల మంది కూర్చునే గ్యాలరీలు, వర్షం వచ్చినా ఆట ఆగని భారీ షామియానాలు… ఇవన్నీ సంక్రాంతికి సిద్ధమవుతున్న కోడిపందేల ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) దృశ్యాలు. సంప్రదాయ ఆట పేరుతో కోట్ల రూపాయల జూదం, రాజకీయ అండతో కార్పొరేట్ ఈవెంట్‌లా మారిన బరులు… ఈసారి సంక్రాంతి కోస్తా జిల్లాల్లో నిజంగా ‘హై స్టేక్స్ గేమ్’గా మారిపోయింది. భీమవరం, ఉండి, సీసలి, ఆకివీడు, యలమంచిలి, కలగంపూడి, దుగ్గిరాల, మీర్జాపురం, మురమళ్ల… ఇలా కోస్తా జిల్లాలన్నీ ఐపీఎల్‌ను మించిన హంగామాతో సిద్ధమవుతున్నాయి. సంప్రదాయ ఆటగా మొదలైన కోడిపందేలు ఇప్పుడు భారీ ఈవెంట్లుగా మారాయి. పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లాలకే పరిమితం కాకుండా, ఈసారి కాకినాడ, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లోనూ అదే స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులే నేరుగా రంగంలోకి దిగుతూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.
ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం
భీమవరం మొదలు కోనసీమ వరకు, ఏలూరు నుంచి కృష్ణా జిల్లా వరకు అనేక ప్రాంతాల్లో విస్తారమైన స్థలాలను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. కొన్ని చోట్ల వ్యవసాయ భూములు, మరికొన్ని చోట్ల రియల్ ఎస్టేట్ లేఅవుట్లు తాత్కాలికంగా ఈ కార్యక్రమాలకు వేదికలుగా మారుతున్నాయి. ప్రధాన రహదారులకు సమీపంలోని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో, ఈ ప్రాంతాలన్నీ ఒక రకంగా ప్రత్యేక ‘ఈవెంట్ జోన్లు’గా మారిపోయాయి. ఈసారి ఏర్పాట్ల స్థాయి గతంతో పోలిస్తే అనూహ్యంగా పెరిగింది. చిన్నపాటి గుడారాలు, తాత్కాలిక షామియానాలతో సరిపెట్టే పరిస్థితి లేదు. వర్షం వచ్చినా ఆటంకం లేకుండా భారీ రెయిన్‌ప్రూఫ్ నిర్మాణాలు, వేల మంది కూర్చునేలా గ్యాలరీలు, రాత్రి పూట కూడా కార్యక్రమాలు సాగేలా శక్తివంతమైన లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని వేదికల్లో ఒకేసారి వేలాది మంది ప్రేక్షకులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక్క రౌండ్ విలువే లక్షల్లో
ప్రవేశానికి ప్రత్యేక టోకెన్లు, గుర్తింపు పద్ధతులు అమలు చేస్తున్నారు. లోపలికి అనుమతి పొందినవారికి భోజనం, పానీయాలు నిర్వాహకులే సమకూరుస్తున్నారు. బయట ఉన్నవారికి ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేకపోయినా, పెద్ద ఎల్ఈడీ తెరలపై దృశ్యాలు చూపించే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం వ్యవహారం ఒక కార్పొరేట్ ఈవెంట్‌ను తలపించేలా ఉంది. ఈ హంగామాతో పాటు నగదు చలామణి కూడా భారీగా ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో కోట్ల రూపాయలు చేతులు మారతాయని అంచనా. ఒక్కో చోట రోజుకు అనేక రౌండ్లు సాగుతుండగా, కొన్నింటిలో ఒక్క రౌండ్ విలువే లక్షల్లో ఉంటుందని సమాచారం. నగదు లావాదేవీల కోసం ప్రత్యేక సిబ్బంది, లెక్కింపు ఏర్పాట్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఉత్సవాల ప్రభావం స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోంది. పండుగ రోజుల్లో ఈ ప్రాంతాలకు భారీగా జనం తరలిరావడంతో హోటళ్లు, లాడ్జీలు, అద్దె ఇళ్లు అన్నీ నిండిపోతున్నాయి. కొన్ని పట్టణాల్లో మూడు రోజుల అద్దెకు గదుల ధరలు సాధారణ రోజులతో పోలిస్తే రెట్టింపు అవుతున్నాయి. హోటళ్లు లేని గ్రామాల్లో తాత్కాలికంగా గుడారాలు, షెడ్లు ఏర్పాటు చేసి అద్దెకిచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
సజావుగా సాగేందుకు స్థానికంగా ‘అనధికార సమన్వయం’ జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సంప్రదాయంగా గ్రామీణ వినోదంగా మొదలైన కార్యక్రమాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. పండుగ ఉత్సాహం ఒకవైపు కనిపిస్తే, మరోవైపు ఇది కోట్ల వ్యాపారంగా రూపాంతరం చెందిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. సంక్రాంతి అంటే పంట పండిన ఆనందమా, లేక పందేలు సాగిన హడావుడా అనే ప్రశ్నను ఈ దృశ్యాలు మౌనంగా లేవనెత్తుతున్నాయి. మొత్తానికి, ఈసారి కోస్తా జిల్లాల్లో సంక్రాంతి కేవలం పండుగ మాత్రమే కాదు. అది ఒక భారీ ఈవెంట్, ఒక హైస్టేక్స్ వ్యవహారం. సంప్రదాయం పేరుతో మొదలై, ఇప్పుడు సంపూర్ణంగా వాణిజ్య రంగు పూసుకున్న ఈ ఉత్సవం ఎటు దారితీస్తుందన్నది మాత్రం కాలమే చెప్పాలి. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జూద క్రీడలు నిర్వహించుకోవాలన్న అవగాహనకు వచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

