మారు వేషంలో సబ్ కలెక్టర్.. ఏం చేశారో తెలుసా?

Sub Collector Surya: ఎరువుల దుకాణాలకు మారువేషంలో వెళ్లి తనిఖీలు చేశారు విజయవాడ సబ్ కలెక్టర్. సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు. ఓ దుకాణంలోకి వెళ్లి ఎరువులు కావాలని అడిగారు. స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు ఆ షాప్ యజమాని. అక్కడి నుంచి మరో షాపుకు వెళ్లి ఎరువులు కావాలని అడిగారు. అక్కడ MRP కన్నా అధికంగా డబ్బులు వసూలు చేశాడు సదరు షాపు యజమాని. పైగా వసూలు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వలేదు. దీంతో అక్కడే కూర్చుని ఒకొక్క అధికారికి ఫోన్ చేసి ఎరువుల షాపులకు పిలిపించారు సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్. వెంటనే ఆ రెండు షాపులను సీజ్ చేయించారు. అక్కడి నుంచి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపులకు తనిఖీకి వెళ్లారు.
ముదినేపల్లిలో ఎరువుల షాపు మూసి ఉండటంతో అక్కడి రైతులను వాకబు చేశారు సబ్ కలెక్టర్. MRP ధరల కన్నా అధికంగా అమ్ముతున్నారని సబ్ కలెక్టర్‌కు గోడు విన్నవించుకున్నారు రైతులు. వెంటనే షాపు యజమానిని పిలిపించారు. ఓనర్‌పై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com