మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలపై క్షత్రియ నేతల కౌంటర్

నిజాయితీపరుడైన మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలకొల్లులోని గాంధీబొమ్మ సెంటర్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే జగన్ కు పాలించే అర్హత లేదని విమర్శించారు. జగన్ లో ఆనందం చూడడం కోసం మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని తెలిపారు.
వెల్లంపల్లి శ్రీనివాస్ ఓ చేతకాని మంత్రి అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలపై క్షత్రియ సంఘాలు చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ మెప్పు కోసం అవినీతి మచ్చ లేని అశోక్ గజపతిరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. వెల్లంపల్లి.. నీ చరిత్ర ఏంటో మర్చిపోయావా.. తాము బయటపెట్టాలా అని ప్రశ్నించారు. ఇలాంటి పనికిమాలిన సన్నాసులు మంత్రులుగా ఉన్నారని ధ్వజమెత్తారు.
వందల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన విజయనగరం రాజులైన అశోక్ గజపతిరాజు కుటుంబంపై మంత్రి వెల్లంపల్లి అనుచిత వ్యాఖ్యలు చేయడంపైనా క్షత్రియ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజాయితీపరుడైన గజపతిరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మంత్రి స్థాయి ఏమిటని మాజీ ఎమ్మెల్యేలు వర్మ, కొండబాబు, బుచ్చిరాజు దుయ్యబట్టారు. వెల్లంపల్లి నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలకు నిరసనగా పాలకొల్లులో క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో అశోక్ గజపతిరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వెల్లంపల్లిని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాముడి తల నరికి వారిని పట్టుకోకుండా.. దేవాలయాలు, విద్యాసంస్థలకు వేల ఎకరాలు విరాళంగా ఇచ్చిన అశోక్ గజపతిరాజును మంత్రి విమర్శించడం దారుణమని మాజీ ఏఎంసీ చైర్మన్ గాంధీ భగవాన్ రాజు, క్షత్రియ పరిషత్ సభ్యులు కృష్ణవర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిజాయితీకి మారుపేరైన అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబు రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. దుర్గా గుడి దగ్గర కొబ్బరి చిప్పులు కొనుక్కుని అమ్ముకునే స్థాయి వెల్లంపల్లిదన్నారు. అలాంటి వ్యక్తి.. వేల ఎకరాలు దేవాలయాలు, విద్యాసంస్థలకు దానం చేసిన అశోక్ గజపతిరాజును విమర్శించడంపై మండిపడ్డారు.
వేలాది ఎకరాలను దేవాలయాలకు దానం చేసిన పూసపాటి వంశం గురించి వెల్లంపల్లి వ్యాఖ్యలను క్షత్రియ రాజమహేంద్రవరం శాఖ తీవ్రంగా ఖండించింది. నగరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నిరసన వ్యక్తంచేసిన క్షత్రియ నాయకులు అశోక్ గజపతిరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేవాలయాలపై దాడులకు బాధ్యత వహించకుండా ఇతరులపై నిందలు మోపడం దారుణమని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com