పండించిన పంట గోదాట్లో కొట్టుకుపోయింది.. రైతుల ఆవేదన

పోలవరం ముంపు బాధితుల నిరాహార దీక్షలు పట్టించుకున్న పాపాన పోలేదు పాలకులు. 16 రోజులుగా మా గోడు వినండి మహా ప్రభో అంటూ వేడుకుంటున్నా అటువైపు తొంగి చూసిన అధికారులు లేరు. తమ పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకంటూ కూనవరంలో దీక్షలకు దిగిన ముంపు బాధితులు మండిపడుతున్నారు. గత నెలలో మూడు సార్లు వచ్చిన వరదల కారణంగా సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల పాటు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుని అష్టకష్టాలు పడ్డామని తెలిపారు. పోలవరం నిర్మాణం పూర్తికాకముందే వరద ప్రవాహం ఈ మండలంపై ఇంత తీవ్ర స్థాయిలో ఉంటే.. ముందు ముందు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇంతవరకు ఈ మండలంలో ఉన్న 16 పంచాయతీలలోని గిరిజన ప్రజలకు పరిహారం అందించలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరదలతో సర్వం కోల్పోయిన గిరిజనుల కష్టాలు అధికారుల కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. గ్రామం చుట్టూ వరద నీరు చేరితే రాత్రికి రాత్రి ప్రాణాలతో బయటపడ్డామని ముంపు బాధితులు తెలిపారు. సంవత్సరం కాలం పండించిన పంట గోదాట్లో కొట్టుకుపోయిందన్నారు. 16 రోజులుగా దీక్షలకు దిగినా అధికారులు తొంగి చూడలేదని.. ఇప్పటికైనా స్పందించి తమకు పరిహారం ఇచ్చి.. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com