కుప్పంలో అరెస్టుల పర్వం

కుప్పంలో అరెస్టుల పర్వం

చిత్తూరు జిల్లా కుప్పంలో అరెస్టుల పర్వం కొనసాగింది. రామకుప్పం మండలం నుంచి మహాపాదయాత్రకు టీడీపీ మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ.. డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర తలపెట్టారు. అదే సమయంలో టీడీపీ పాదయాత్రను భగ్నం చేసేందుకు.. వైసీపీ కూడా ర్యాలీకి పిలుపు ఇచ్చింది. ఇలా పోటాపోటీ ర్యాలీలతో చిత్తూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు ర్యాలీలు చేపట్టినా.. కేవలం టీడీపీ నేతలపైనే పోలీసులు ఫోకస్‌ చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

రామకుప్పం నుంచి టీడీపీ మహాపాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. టీడీపీ నాయకుల గృహ నిర్బంధాన్ని ఖండించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్న టీడీపీపై అణచివేత చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. తమ హయాంలో పులివెందులకు నీళ్లిచ్చి చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడామని గుర్తు చేశారు.

టీడీపీ పాదయాత్రను భగ్నం చేసేందుకు పోలీసులు కీలక నేతల్ని హౌస్ అరెస్టు చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల కనుసన్నల్లో నిరంకుశ పాలన సాగుతోందన్నారు అమర్‌నాథ్‌రెడ్డి. ప్రశ్నించే వారిని ప్రభుత్వం భయపెడుతోందని ఆరోపించారు.

పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ అనీషారెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కుప్పం నియోజకవర్గంపై సీఎం జగన్‌ కక్షకట్టారని.. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో హంద్రీనీవా ప్రాజెక్టును అటకెక్కించారని అనిషారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై కక్షసాధింపు ఎందుకని ప్రశ్నించారు. అటు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు చిత్తూరు టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు పులివర్తి నాని. రైతుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం చేట్టిన హంద్రీనీవా ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఎందుకివ్వాలనే ధోరణిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. హంద్రీనీవా ఎత్తిపోతల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story