కర్రల సమరానికి సిద్ధమైన దేవరగట్టు.. అర్ధరాత్రి అగ్గి దివిటీలు..

కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరానికి సిద్ధమైంది. ఏటా విజయ దశమి పర్వదినం రోజు అర్ధరాత్రి ఇక్కడ అగ్గి దివిటీలు ఎగిరెగిరి పడతాయి. ఆ వెలుగుల్లో కొన్ని వేల మంది కర్రలతో తలపడతారు. మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాల్లో పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఏటా కొందరి తలలు పగులుతూనే ఉన్నాయి. ఆచారావ్యవహారాలు, పట్టింపుల కారణంగా పోలీసుల ఆంక్షల అక్కడ పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి.
ఆలూర్ నియోజకవర్గం హోళగుంద మండల పరిధిలో దేవరగట్టులో వెలసిన మాల మల్లేశ్వర స్వామి దసరా ఉత్సవాలు పూర్వం నుంచి అత్యంత సాంప్రదాయ బద్దంగా సాగుతుంటాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఒక్క రాయలసీమ వాసులే కాకుండా పొరుగున ఉన్న తెలంగాణా, కర్ణాటక, మహారాష్ర్ట నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. దేవరగట్టు పూర్తిగా అటవీ ప్రాంతం. అక్కడ ఎత్తైన కొండపై కూర్మ ఆవతారంలో మాల మల్లేశ్వర స్వామి వెలిశారు. ఆ దేవుని దర్శనం కోసం సమీప గ్రామాలైన నెరణికి, నెరణికి తాండ, కొత్తపేట, సులువాయి ప్రజలు వెళ్లేవారు. అది అటవీప్రాంతం కావడంతో ఎలుగుబంట్లు, చిరుత పులులు దాడి చేసే అవకాశం ఉందనే కారణంగా.. ఆత్మరక్షణ కోసం అగ్గి దివిటీలు, కర్రలు తీసుకెళ్లేవారు. అదే తర్వాతి కాలంలో బన్నీ ఉత్సవంగా రూపంతరం చెందింది. విజయ దశమి పర్వదినం రోజు మాలమ్మ-మాలమల్లేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా సాగుతుంది. ఆ తర్వాత స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను జైత్రయాత్రగా కిందకి తీసుకొచ్చి మళ్లీ ఊరేగింపుగా పైకి తీసుకెళ్తారు. ఈ సమయంలోనే సమీప గ్రామ ప్రజలు కర్రలతో ఒకరిపై ఒకరు కొట్టుకుంటారు. దివిటీలను గాలిలోకి విసురుతుంటారు. దేవరగట్టు ఉత్సవాల్లో కర్రల సమరాన్ని ఆపాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు కఠిన ఆంక్షలు పెట్టినా బ్రేకులు పడడం లేదు.
జైత్రయాత్ర సమయంలో ఒక గ్రామం వారు మాత్రమే ఉత్సవ విగ్రహాలను మోసుకుని తీసుకెళ్తుంటారు. ఆ విగ్రహాలను తమ ఊరికి తీసుకెళ్తే మంచి జరుగుతుందనే నమ్మకంతో మిగతా గ్రామాల వారు ఆ విగ్రహాల్ని తీసుకెళ్లేందుకు తలపడతారు. అలాంటప్పుడు కర్రల సమరంలో కొందరి తలలు పగిలిన ఘటనలు ప్రతిసారీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కరోనా నేపథ్యంలో దేవరగట్టు బన్నీ ఉత్సవాలపై కఠిన ఆంక్షలు విధించారు. కర్రలు పట్టుకుని దేవరగట్టుకి ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆలూర్. హోళగుంద మండలాల్లో రెండు రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. 144 సెక్షన్‌ను అమలవుతోంది. ఎవరైనా కర్రలు చేత్తో పట్టుకుని భయటికి వస్తే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయితే, భక్తులు మాత్రం కర్రల సాము నిర్వహించి తీరుతామంటున్నారు. దీంతో ఈ ఏడాది ఉత్సవాలు ఎలా జరుగుతాయి.. ఏం జరుగుంది అనేది ఉత్కంఠగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com