ప్రశాంతంగా ఉండే తిరుపతిలో భూ అక్రమ దందాలు..
ప్రశాంతంగా ఉండే తిరుపతిలో భూ అక్రమ దందాలు పెచ్చుమీరాయి. సామాన్యుడి నుంచి పలుకుబడి ఉన్న వ్యక్తుల వరకు స్థలాలన్నీ వరుసగా కబ్జాలకు గురవుతున్నాయి. నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. నయానో, భయోనో భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు భూ బకాసురులు. ఇదంతా కడప గ్యాంగ్‌ల పనేనని బాధితులు ఆరోపిస్తున్నారు. రేణిగుంట రోడ్డులో 57 సెంట్ల భూమిపై యండపల్లి రమేష్ రెడ్డి గ్యాంగ్ కన్ను పడింది. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్లిన కొంతమంది తాము కొల్లం గంగిరెడ్డి అనుచరులమంటూ గేటుకు తాళాలు వేశారని బాధితులు అంటున్నారు. అయితే వాళ్లు తన అనుచరులు కారంటూ గంగిరెడ్డి సోషల్ మీడియాలో ప్రకటించారు. సీన్ కట్ చేస్తే ఇదంతా కడప గ్యాంగ్ పనని పోలీసులు తేల్చారు.
బాలాజీ టింబర్ డిపో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసుల టీం... యండపల్లి రమేష్ రెడ్డి గ్యాంగ్ ఆటకట్టించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇప్పటికే 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు, వారి ద్వారా మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉన్నట్లు జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి చెప్పారు. త్వరలోనే వారందరినీ పట్టుకుంటామన్నారు.
ఇంతకీ ఎవరీ యండపల్లి రమేష్ రెడ్డి? రౌడీ షీటరా? పొలిటికల్ లీడరా? భూ మాఫియాకు సూత్రధారా? అతడి వెనుకున్నది ఎవరు? ఏ అండ చూసుకుని తిరుపతిలో భూ దందాలకు పాల్పడుతున్నాడు? ప్రశాంతంగా ఉన్న తిరుపతిలో... కడప నుంచి వచ్చి ఎందుకు కబ్జాలకు పాల్పడుతున్నాడు? గ్యాంగ్‌లు ప్రజలను ఎందుకు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు? ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తిరుపతిలో భూదందాలు పెరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీధి రౌడీలు సైతం ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అయితే ఇలాంటివి తమ దృష్టికి వస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటామంటున్నారు జిల్లా ఎస్పీ. అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో ఓ కమిటీ వేసినట్లు ఎస్పీ రమేష్ రెడ్డి చెప్పారు. DPOలో ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో యాక్షన్ తీసుకుంటామన్నారు. తిరుపతిలో ఇటువంటి యాక్టివిటీస్‌కు తావు ఉండదని, నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో భూముల ధరలకు రోజురోజుకు రెక్కలొస్తున్నాయి. భూబకాసురులు కోట్లాది రూపాయల విలువైన భూములపై కన్నేశారు. నకిలీ పత్రాలు సృష్టించి రాత్రికి రాత్రే కబ్జా చేసేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో భూములు అమ్మాలన్నా, కొనాలన్నా సామాన్యులకు ఇబ్బందులు తప్పడంలేదు. అంతేకాదు ఉన్న భూములను ఎలా కాపాడుకోవాలో అర్థంగాక నగర వాసులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు భూదందాల వెనుక రాజకీయ డేగలు ఉన్నట్లు విమర్శలు వస్తుండడంతో భూకబ్జాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డిని కోరారు. మరోవైపు అధికార పార్టీ అండదండలతోనే భూదందాలు జరుగుతున్నట్లు తిరుపతి వాసులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదంటూ బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారు ఆందోళన చేపట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com