తమ భూమిని కాపాడుకోవడానికి జవాన్ కుటుంబసభ్యుల నిరసన

తమ భూమిని కాపాడుకోవడానికి జవాన్ కుటుంబసభ్యుల నిరసన
బాధిత జవాను కుటుంబం కోసం సహచర జవానుల కుటుంబ సభ్యులు సైతం నిరసనకు దిగారు

ఖాళీ జాగా కనపడితే చాలు గద్దెల్లాగా వాలిపోతున్నారు. నీది నాది అనే తేడా లేదు.. కబ్జా బోర్డు పెట్టేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ కరకట్ట వద్ద మాజీ జవాన్ కి చెందిన ప్రభుత్వ భూమిపై కబ్జారాయుళ్ల కన్నుపడింది. ఎలాగైనా ఆ భూమిని దక్కించుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. దీంతో తమ భూమిని కాపాడుకోవడానికి ఆ జవాన్ కుటుంబసభ్యులు నిరసనకు దిగారు.

మాజీ సైనికుడు అయినా బసవన్నకు కేంద్ర ప్రభుత్వం 1.80 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చింది. అయితే దీనిపై కన్నుపడిన కొంతమంది అక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై కోర్టులో పోరాడుతూ బసవన్న కన్నుమూశారు. ఇదే అదునుగా భావించిన బుర్రముక్క శివారెడ్డి శేషులు అనే వ్యక్తి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. స్థానిక ఎమ్మార్వో తమ పక్షాన నిలబడి పొలానికి కొలతలు వేసి ఇచ్చినప్పటికీ తమను బెదిరిస్తున్నారని కుటుంబసభ్యులు వాపోతున్నారు.

బాధిత జవాను కుటుంబం కోసం సహచర జవానుల కుటుంబ సభ్యులు సైతం నిరసనకు దిగారు. తమ సాటి జవాను కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులను సైతం లెక్కచేయడం లేదని.. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కల్పించుకున్నా కూడా కబ్జాదారులు మాట వినడం లేదని చెబుతున్నారు.

అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన భూమి పట్టా, యాజమాన్య హక్కులు ఉన్నప్పటికీ కబ్జాదారులు పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని మొర పెట్టుకుంటున్నారు.


Tags

Read MoreRead Less
Next Story