తూర్పుగోదావరి జిల్లా యూనియన్‌ బ్యాంక్‌లో భారీ స్కాం

తూర్పుగోదావరి జిల్లా యూనియన్‌ బ్యాంక్‌లో భారీ స్కాం
యూనియన్ బ్యాంక్ చాలా ఉదారంగా అప్పులిచ్చేశారు. కనీస పరిశీలన లేకుండా వేరే వారి భూములపై కౌలు రైతుల పేరిట విరివిగా లోన్లు మంజూరు చేశారు.

బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవాలంటే సవాలక్ష నిబంధనలు. ఏవేవో డాక్యుమెంట్లు అడుగుతూ ముప్పుతిప్పలు పెడతారు. కాని, అంబాజీపేట ఆంధ్రాబ్యాంకు వారు.. ఇప్పటి యూనియన్ బ్యాంక్ చాలా ఉదారంగా అప్పులిచ్చేశారు. కనీస పరిశీలన లేకుండా వేరే వారి భూములపై కౌలు రైతుల పేరిట విరివిగా లోన్లు మంజూరు చేశారు. తీరా లోన్లు తీసుకొన్నవారు చేతులెత్తేయడంతో భూ యజమానులు లబోదిబోమంటున్నారు. ఈ రుణ బాగోతం వెనుక ఒక వైసీపీ నేత ఉన్నాడని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలోని యూనియన్ బ్యాంకుగా మారిన ఆంధ్రాబ్యాంకు ఈ మాయ రుణాలకు వేదికయ్యింది.

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన కొలిశెట్టి శ్రీరాములుకు... సర్వే నెంబర్ 131లో ఎకరం భూమి ఉంది. ఇందులో కొబ్బరితోట వేశారు. ఈ భూమిపై ఇప్పటివరకు ఎటువంటి రుణాలు‌ తీసుకోలేదు. ఈమధ్య తన కుమార్తె వివాహం‌ కోసం డబ్బు అవసరమై బ్యాంకు రుణం కోసం ప్రయత్నించారు యజమాని కొలిశెట్టి శ్రీరాములు. అప్పటికే, ఆ భూమిపై లోన్ తీసుకున్నారని బ్యాంక్ అధికారులు చెప్పడంలో శ్రీరాములు షాక్‌ అయ్యారు. మీసేవలో భూమిపై లావాదేవీలు పరిశీలిస్తే.. కళ్లు తిరిగే హిస్టరీ కనిపించింది. అంబాజీపేట మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన కుడిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి కౌలు రైతు కార్డుతో 99వేల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఇంకో షాకింగ్‌ విషయం ఏంటంటే.. తన ఎకరం భూమిని ఇప్పటి వరకు ఎవరికీ కౌలుకు ఇవ్వలేదని చెబుతున్నారు యజమాని కొలిశెట్టి. బ్యాంకు వాళ్లు పొంతనలేని సమాధానం చెప్పడంతో లోన్‌ తీసుకున్న వ్యక్తిని నిలదీశారు. విషయం బయటకు రావడంతో సదరు వ్యక్తి తీసుకున్న రుణాన్ని చెల్లించేశాడు.

కొలిశెట్టి శ్రీరాములు భూమిపైనే కాదు.. అతని చిన్నమ్మ కొలిశెట్టి నాగవెంకటలక్ష్మికి‌ చెందిన మూడు ఎకరాల కొబ్బరి తోటపై కూడా అదే బ్యాంకులో లోన్‌ తీసుకున్నట్లు ఉంది. బాధితురాలికి తెలియకుండానే అంబాజీపేట యూనియన్‌ బ్యాంక్‌లో బొక్కా వెంకటమాధవి పేరుతో 99వేల రూపాయలు లోన్ ముంజూరైంది. తమ భూములను ఎవరికీ కౌలుకు ఇవ్వక‌పోయినా రెవెన్యూ అధికారులు కౌలు రైతు‌ కార్డులు ఎలా ఇచ్చారన్నది అంతుపట్టడం లేదు.

అంబాజీపేట మండలం మాచవరంలో భూ యజమానులకు తెలియకుండా ఇలా రుణాలు తీసుకోవడం వెనక మాచవరానికి చెందిన ఓ వైసీపీ నేత హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే.. అంబాజీపేటలో ఇలా ఎంతమంది మోసపోయారో తెలిసే అవకాశం ఉందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అటు బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలు కలుగుతున్నాయి. కౌలు కార్డుపై ఎకరాకు 35 వేల రూపాయలకు మించి రుణం ఇచ్చేఅవకాశం లేదు. కాని, లక్షలాది రూపాయల రుణాలు మంజూరు చేయడం ఉద్యోగుల హస్తం ఉందా లేక మరేదైనా స్కాం దాగి ఉందా అన్నది తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.Tags

Read MoreRead Less
Next Story