ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అపశృతి

ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. అధికారులు నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలపై తీసుకొచ్చింది. దసరా ఏర్పాట్లు భారీగా చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని ప్రకటనలు చేశారు.కానీ కొండ చరియలు విరిగిపడ్డాయి. ఒకసారిగా కొండచరియలు విరిగిపడటంతో భక్తులు, సిబ్బంది భయాందోళనకు గురైయ్యారు. దీనికి సబంధించి సీసీ దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
మూల నక్షత్రం కావడంతో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు సీఎం జగన్. ఈ సమయంలోనే ఒక్కసారి కొండపై గందగోళం నెలకొంది. కొండచరియల కింద ఒక పోలీస్, ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటన స్థలికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. దుర్గగుడిపై కొండచరియలు విరిగిపడటంతో ముఖ్యమంత్రి జగన్ రూట్ మ్యాప్ లో మార్పులు జరిగాయని ప్రచారం జరగడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఘాట్ రోడ్డు వైపు నుంచి కాకుండా మహా మండపం ద్వారా ముఖ్యమంత్రి అమ్మవారిని దర్శించుకుoటారని అధికార వర్గాలు తెలిపాయి. తీరా ముఖ్యమంత్రి ఘాట్ రోడ్డు ద్వారానే కొండపైకి వస్తారని సమాచారం రావడంతో ఇంద్రకీలాద్రిపై అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
ఇక సీఎం జగన్ ఘాట్ రోడ్డు మీదుగా వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కింద పడ్డ కొండచరియలను పక్కకి జరిపి సీఎం కి రెడ్ కార్పెట్ పరిచారు అధికారులు. హుటాహుటిన శాంతి పూజలు నిర్వహించారు. ఘాట్ రోడ్డు ద్వారా ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు అందించారు. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులు కొండచరియాల తొలగింపు చేపట్టారు. జెసీబీతో కొండ రాళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com