REACTIONS: జగన్‌పై దాడి కోడికత్తి 2.O

REACTIONS: జగన్‌పై దాడి కోడికత్తి 2.O
త్వరగా కోలుకోవాలన్న ప్రధాని.... సమగ్ర దర్యాప్తు చేయాలన్న చంద్రబాబు

బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడిని పలువురు ప్రముఖులు ఖండించారు. సీఎం జగన్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ కోరగా.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పారు. ప్రచారానికి స్పందన కరవవడంతో కోడికత్తి 2.0కి తెరలేపారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగిందని అనుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు YS షర్మిల అన్నారు.

సీఎం జగన్‌ త్వరగా కోలుకుని.. ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. దాడి ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.. ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని కోరుతున్నానని అన్నారు. రాజకీయ విభేదాలు హింసకు దారి తీయకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ హితవు పలికారు. జగన్‌ త్వరగా కోలుకోవాలని... తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌లో ఆకాంక్షించారు. జగన్‌పై రాయి విసిరిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జగన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి స్పందన కరవవడంతో కోడికత్తి 2.0కి తెరలేపారని తెలుగుదేశం విమర్శించింది. సీఎం పర్యటన జరుగుతుంటే అదే సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా? ఘటన జరిగాక కొద్ది నిమిషాల్లోనే పేర్ని నాని, అంబటి రాంబాబు లైవ్‌లోకి వచ్చి.. ఇదంతా చంద్రబాబు చేయించారంటూ వైసీపీ పా అనుకూల మీడియాలో ప్రచారం చేయడం ముందస్తు ప్రణాళిక కాదా? కాలం చెల్లిన ఇలాంటి నాటకాల్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జరగని దాడిని జరిగినట్లు ప్రచారం చేసుకుని సానుభూతి కోసం పాకులాడుతున్నారు. ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మరు. ఇది మరో కోడికత్తి 2.0 తప్ప మరొకటి కాదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. దాడి జరిగిన నాలుగు నిమిషాల్లోనే క్యాట్‌ బాల్‌ ఉపయోగించారని సాక్షి సహా జగన్‌ అనుకూల మీడియాకు ఎలా తెలిసింది? ఈ డ్రామా జరిగినప్పుడు చుట్టూ ఉన్నది వైకాపా కార్యకర్తలు, పోలీసులే. మరి నిందితుణ్ని ఎందుకు పట్టుకోలేదు? విజయవాడలో సీఎం పర్యటన ఉందని తెలిసీ విద్యుత్తు సరఫరా ఎందుకు నిలిపివేశారు? గొడ్డలి దాడి, కోడికత్తి డ్రామా అయిపోయాయి. క్యాట్‌ బాల్‌ డ్రామా మొదలుపెట్టారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. దాడి జరిగితే డీజీపీ, నిఘా విభాగాధిపతి ఏం చేస్తున్నారు? గొడ్డలివేటు, కోడికత్తి నాటకాలు అయిపోయాయి. ఇప్పుడు గులకరాయి దాడి డ్రామాకు జగన్‌ తెరలేపారు. వేలమంది పోలీసుల భద్రత మధ్య దాడి జరగడం సాధ్యమేనా? నిజంగా దాడి జరిగితే నిందితుల్ని వెంటనే పోలీసులు ఎందుకు పట్టుకోలేదని వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌కు ప్రమాదవశాత్తు గాయమైందని భావిస్తున్నాను.. అలాకాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందేనని వై.ఎస్‌. షర్మిల అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story