TIRUMALA: తిరుమలలో చిక్కిన మరో చిరుత

తిరుమల నడకదారిలో ఏర్పాటు చేసిన బోన్‌లో మరో చిరుత చిక్కింది. గత వారం రోజులుగా చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. అలిపిరి నడకమార్గంలోని లక్ష్మీనరసింహ ఆలయం వద్ద అటవీప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కుకుంది. జూన్ 23 నుంచి నడకమార్గంలో ఇప్పటివరకు ఆరు చిరుతలను అటవీశాఖ బంధించింది. లక్షిత మృతదేహం లభ్యమైన ప్రదేశంలోనే చిరుత సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాలో గుర్తించారు. తర్వాత అక్కడ బోను ఏర్పాటు చేశారు. పట్టుబడ్డ చిరుతను జూకు తరలించి పరీక్షలు చేస్తారు. చిన్నారి లక్షితపై దాడి చేసి హతమార్చిన చిరుత ఇదా కాదా అని నిర్ధారిస్తారు. లక్షితపై దాడి చేసిన చిరుతని గుర్తించడంలో ఉత్కంఠ కొనసాగుతోంది. లక్షితపై దాడి చెయ్యలేదని నిర్ధారణ కావడంతో ఇప్పటికే రెండు చిరుతలను అటవీ ప్రాంతంలో వదిలేయడం జరిగింది. మరో రెండు చిరుతల రిపోర్ట్‌లు రావాల్సి ఉండటంతో.. చిరుతల్ని ఎస్వీ జూలో క్వారంటైన్‌లో ఉంచారు. నేడు చిక్కిన చిరుత నమూనాని సైతం అధికారులు ల్యాబ్‌కి పంపనున్నారు.
అలిపిరి కాలిబాట మార్గంలో ఆపరేషన్ చిరుత ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడు నెలల వ్యవధిలో అలిపిరి నడక మార్గంలో ఆరు చిరుతలను అటవీ అధికారులు బంధించారు. జూన్ 22వ తేదీన 7వ మైల్ వద్ద కౌశిక్‌పై దాడి తరువాత చిరుతలను అటవీ అధికారులు బంధిస్తూ వస్తున్నారు. జూన్ 23వ తేదీ రాత్రి 7వ మైల్‌కి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుతను అటవీ అధికారులు బంధించారు. ఆగస్ట్11వ తేదీన అలిపిరి కాలిబాట మార్గంలోని నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో అరేళ్ళ బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది.
బాలికపై దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఆగష్టు 14, 17వ తేదీల్లో బోనులో రెండు చిరుతలు చిక్కాయి. ఆగస్ట్ 28వ తేదీ 7వ మైల్‌కి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోన్‌లో మరో చిరుత చిక్కింది. సెప్టెంబర్ 7వ తేదీన నరసింహస్వామి ఆలయం..7వ మైల్‌కి మధ్యలో ఏర్పాటు చేసిన బోన్‌లో ఇంకో చిరుత చిక్కింది. ట్రాప్ కెమెరాల ద్వారా మరో 5 చిరుత సంచారాలను గుర్తించి 7వ మైల్ నుంచి నరసింహ స్వామి ఆలయం మధ్యలోని అటవీ ప్రాంతంలో 9 బోన్‌లను అటవీ అధికారులు ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com