తిరుమలలో విషాదం.. చిరుత దాడితో చిన్నారి మరణం

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కాలి నడకన వస్తామని మొక్కుకుంటారు.. చుట్టూ చెట్లు మధ్యలో శ్రీవారి మెట్లు.. మరొకదారి అలిపిరి. జన సంచారం బాగానే ఉన్నా అడవి జంతువులు ఒక్కోసారి భక్తుల మీద దాడి చేస్తుంటాయి. జంతువుల దాడితో ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు తరచుగా వెలుగు చూస్తుంటాయి.
శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. అలిపిరి నడక దారిలో వస్తుండగా హఠాత్తుగా చిరుత వారిపై దాడి చేసింది. చిరుత చిన్నారిని తీసుకుని పొదల్లోకి వెళ్లింది. దాంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. టిటిడీ అటవీ శాఖ రంగంలోకి దిగి బాలికను కనుగొనే ప్రయత్నం చేశారు.
కాలినడకన వెళ్తున్న పాదచారులు మరుసటి రోజు ఉదయం లక్షిత మృత దేహాన్ని కనుగొన్నారు, వెంటనే తిరుమల సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు తమ బిడ్డే అని గుర్తించారు. తిరుమల పర్యటన తమకు విషాదాన్ని మిగిల్చిందని లక్షిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com