న్యూ ఇయర్ ఎఫెక్ట్.. ఏపీలో రెండు రోజుల్లో రూ.200 కోట్ల మద్యం అమ్మకాలు.. ఇక తెలంగాణలో..

న్యూ ఇయర్ ఎఫెక్ట్.. ఏపీలో రెండు రోజుల్లో రూ.200 కోట్ల మద్యం అమ్మకాలు.. ఇక తెలంగాణలో..
గత ఏడాదితో పోలిస్తే అనూహ్యంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్‌ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి.

కరోనా సమయంలోనూ లిక్కర్ సేల్స్ ఎక్కడా తగ్గలేదు. గ్రాండ్ ఈవెంట్స్, పార్టీలు, పెద్దగా హవావుడి లేకపోయినా.. సైలెంట్‌గా మద్యం లాగించారు. గత ఏడాదితో పోలిస్తే అనూహ్యంగా అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్‌ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. సుమారు 19వందల 16 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. డిసెంబర్‌ 30, 31 రోజుల్లో రెండు వందల కోట్ల విక్రయాలు జరిగాయి.

తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. గత నాలుగు రోజుల్లోనే దాదాపు 759 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఆంధ్రా సరిహద్దున ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా 75.98 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. డిసెంబర్ నెల మొత్తం మీద 2 వేల కోట్లకు పైగానే మద్యం విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. నూతన సంవత్సరాదిలోకి అడుగుపెడుతున్న వేళ.. 8.61 కోట్ల లిక్కర్ కేసులు.. 6.62 కోట్ల బీరు కేసులను విక్రయించినట్లు వెల్లడించింది. ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేకపోయినప్పటికీ.. గత ఏడాదితో పోలిస్తే.. 200 కోట్లు అధికంగా ఆదాయం రావడం విశేషం.

డిసెంబర్‌ 28వ తేదీన 205.18 కోట్లు, మరుసటి రోజు 150 కోట్లు, 30న 211.35 కోట్లు, 31వ తేదీన 193 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నాలుగు రోజుల్లోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 300 కోట్ల మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. వరంగల్‌లో 63.49 కోట్లు, మెదక్ జిల్లాలో 53.87 కోట్లు, ఖమ్మం జిల్లాలో 52.70 కోట్లు, కరీంనగర్‌లో 50.78 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది.

న్యూ ఇయర్‌ సందర్భంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ కేసులు, పార్టీలకు అనుమతి ఇవ్వకపోవడంతో మందుబాబులు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి ఇళ్ల దగ్గర తాగడానికి మొగ్గు చూపారు.


Tags

Read MoreRead Less
Next Story