Tirumala Ornaments: వెంకటేశ్వరుడికి శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణాల లిస్టులో..

Tirumala Ornaments: ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. ఆపదమొక్కులవాడా.. వడ్డీ కాసుల వాడా.. అని తిరుమల శ్రీనివాసుడిని మనసారా కొలుస్తారు భక్తులు. నిజంగానే పేరుకు తగ్గట్టే.. భక్తుల నుంచి వడ్డీతో సహా తీసుకుంటాడంటారు. అందుకే భక్తి ప్రపత్తులతో ఆ స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. వారిలో శ్రీకష్ణదేవరాయలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన తిరుమలేశుడికి ఇచ్చిన ఆభరణాలకు అంతటి ఖ్యాతి ఉంది.
బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు.. ఇలా ఒకటా రెండా.. లెక్కపెట్టలేనన్ని, చూడడానికి రెండు కళ్లూ చాలనంతగా ఆ శ్రీనివాసుడికి వెలకట్టలేనన్ని ఆభరణాలు ఉన్నాయి. మహా రాజులు, మహారాణులు, ఇతర భక్తకోటి ఇచ్చిన కానుకలు అలాంటివి. ఇంతకీ ఎవరెవరు ఏమేం ఇచ్చారంటే..
పల్లవరాణి.. స్వామివారికి సమర్పించిన ముఖ్యమైన కానుక ఏమిటో తెలుసా.. స్వామి వారి వెండి విగ్రహం. పవళింపు సేవలందుకునే భోగ శ్రీనివాసమూర్తి.. ఈ ప్రతిమలోనే భక్తులకు దర్శనమిస్తారు
శ్రీకృష్ణదేవరాయులు తన జీవితకాలంలో ఏడుసార్లు స్వామివారి దర్శనానికి వచ్చారు. అలా వచ్చిన ప్రతీసారీ భారీగా కానుకలు సమర్పించుకున్నారు. వాటిలో వెండి పళ్లాలు, మణిమయ కిరీటాలు, మకరతోరణాలను ఇచ్చారు. తిరుమల భక్తులు పరమ పవిత్రంగా భావించే ఆనంద నిలయ గోపురానికి బంగారు తొడుగు చేయించిది కూడా కృష్ణదేవరాయులే.
శ్రీవారి ఆభరణాల్లో చాలా అరుదైనవి కూడా ఉన్నాయి. అలాంటివి ఇంకెక్కడా పెద్దగా కనిపించవు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గరుడ మేరు పచ్చ. ఇది దాదాపు 500 గ్రాములు ఉంటుంది. దీనిని పరమ పవిత్రంగా భావిస్తారు.
తిరుమలేశుడికి ఏడు కిరీటాలున్నాయి. ఇందులో గద్వాల్ మహారాణి కిరీటం గురించి ప్రతేకంగా చెప్పుకోవాలి. దీనితోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కొన్ని కిరీటాలను చేయించింది. ఇవి కాక.. ఉత్సవ విగ్రహాలకు కూడా మరో ఏడు కిరీటాలు ఉన్నాయి. భక్తులంతా వీటిని దర్శించుకునే వీలుంటుంది.
వెంకటేశ్వరుడికి 20 ముత్యాల హారాలు ఉన్నాయి. 50 కాసుల దండలు కూడా ఉన్నాయి. వీటితోపాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరొకటుంది. శ్రీనివాసుడి మూలవిరాట్టు కిరీటం నుంచి స్వామివారి పాదపద్మాల వరకు రకరకాల ఆభరణాలు ఉంటాయి. అలాంటి ఆభరణాల సెట్లు మొత్తం మూడు ఉన్నాయి.
ఆ వడ్డీ కాసుల వాడికి భక్తితో సమర్పించే కానుకలకు లెక్కే లేదు. భక్తులంతా తమకు కలిగినంతలో వెండో, బంగారమో, డబ్బునో కానుకలుగా సమర్పించుకుంటారు. అది తృణమైనా, ఫణమైనా ఎంతో ఆరాధనతో ఇస్తారు. ఇది నిత్యం జరిగేదే. ఇక వీరు కాకుండా నిత్యం ఎంతోమంది దాతలు.. స్వామివారి వివిధ ట్రస్టులకు విరాళాలను ఇస్తూనే ఉంటారు.
ఆ ఆపద మొక్కులవాడికి స్వర్ణాభరణాలు, ఇతర ఆస్తులను దానం చేసేవారు ఎందరో. అందుకే తిరుమలేశుడిని ఊరేగించడానికి వీలుగా బంగారు రథాలతో పాటు స్వర్ణమయమైన వాహనాలు కూడా ఉన్నాయి. ఏ కష్టం వచ్చినా సరే.. స్వామివారిని శరణుకోరే భక్తులు.. తమ మొక్కులను ఇలా వివిధ రూపాల్లో చెల్లించుకుంటారు. కానీ వీటిలో కృష్ణదేవరాయల వారు సమర్పించిన కానుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com