LOCAL ELECTIONS: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సమర సన్నాహాలు

తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరిగింది. రెండు రాష్ట్రాల్లోనూ స్థానిక సమరానికి సన్నాహాలు చేస్తుండడంతో గ్రామాల్లో రాజకీయ కాక పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం చంద్రబాబు ఈ నెల 19న టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సూచించారు. ఇటువైపు రేవంత్‌రెడ్డి కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే సూచించారు.
ఈసీతో మంత్రి నారాయణ భేటీ
మూణ్నాలుగు నెలల్లో ఎన్నికలొస్తున్నాయని, ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే సూచించారు. దీంతో ప్రభుత్వం స్థానిక సమరానికి సిద్ధమవుతోందన్న విషయం స్పష్టమవుతోంది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీలకు, అదే ఏడాది మార్చిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలంలో మరో నాలుగు నెలల్లో ముగియనుంది. మూడు నెలలు ముందుగా డిసెంబరులో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధత లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇంకా సమాధానం రాలేదు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు ఏర్పాట్లు చేస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి తీసుకుంది. వీటి నుంచి మున్సిపల్, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం మున్సిపల్, పంచాయతీల్లో మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయడమే తడవుగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలన్న యోచనతో ఎన్నికల సంఘం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ శుక్రవారం కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక సంస్థలకు ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు వేర్వేరుగా ఇటీవల లేఖలు రాసింది. ప్రభుత్వ సన్నద్ధతపై మంత్రి నారాయణ ఎన్నికల కమిషనర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనల ప్రకారమైతే డిసెంబరులో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తికి 30-45 రోజుల సమయం అవసరమని అధికారులు చెబుతున్నారు. పంచాయతీ, మున్సిపల్ ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగిశాకే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలోనూ...
స్థానిక సంస్థల ఎన్నికలపై ఇటీవల తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పాత రిజర్వేషన్ల విధానంలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు జరపాలని కేబినెట్ తీర్మానించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు మాత్రం బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై వివాదం తేలిన తర్వాతే నిర్వహించాలని నిర్ణయించింది. కోర్టుల్లో పంచాయతీ ఎన్నికలపై మాత్రమే వివాదం ఉన్నందున వాటిని ముందుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 20 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినందున ముందుగా వాటిని పూర్తి చేయాలని నిర్ణయించారు. డిసెంబరు నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేలా కసరత్తు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. BC రిజర్వేషన్లపై కేసులు కోర్టుల్లో తేలేందుకు సమయం పట్టనున్నందున ఇప్పటికే హైకోర్టు, సుప్రీం కోర్టు సూచనల ప్రకారం 50శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

