AP CM Tour: జనసమీకరణకై అష్టకష్టాలు పడుతోన్న నేతలు

AP CM Tour: జనసమీకరణకై అష్టకష్టాలు పడుతోన్న నేతలు
ఉపాధి కూలీలు,పొదుపు మహిళలు,అంగన్‌వాడీ కార్యకర్తలతో..సభా ప్రాంగణం నింపాలని ఆదేశాలు; రాకపోతే పథకాలు ఆపేస్తామంటున్న వలంటీర్లు

సీఎం జిల్లాల పర్యటన అంటేనే అధికారులు హడలిపోతున్నారు. జనసమీకరణకు నేతలు టార్గెట్లు విధించడంతో అధికారులు హైరానా పడిపోతున్నారు. సీఎం జగన్‌ ఇవాళ తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటనకు వస్తుండడంతో జనసమీకరణకు 750 ఆర్టీసీ బస్సులతోపాటు 500 స్కూల్‌ బస్సులు, ప్రైవేటు బస్సులను ఏర్పాటుచేశారు. ఉపాధి కూలీలు, పొదుపు మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలతో వాహనాలను నింపాలని శాఖలవారీగా టార్గెట్లు విధించారు. ఉపాధి కూలీలు సీఎం సభకు వస్తే ఒకరోజు మస్టరు అదనంగా వేసి కూలిడబ్బులు చెల్లిస్తామని గ్రామ స్థాయిలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు చెబుతున్నారు.


మరోవైపు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు అధికారులు. వెంకటగిరి పట్టణంలో షాపులను మూయించారు అధికారులు. సీఎం సభవద్ద రంగవల్లుల బాధ్యతను అంగన్‌వాడీలకు అప్పగించడంతో 50మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఆ కార్యక్రమంలో తలమునకలయ్యారు. మహిళలు అధికంగా కన్పించేలా సభా ప్రాంగణంలో ఓ వైపు 3500 మంది పొదుపు మహిళలుండేలా చూసే భాద్యతను వెలుగు సిబ్బందికి కేటాయించినట్లు తెలిసింది. చేనేతలు అధికంగా ఉన్న వెంకటగిరిలో ఆ సామాజిక వర్గం నుంచి మహిళలను ఎక్కువ సంఖ్యలో తరలించాలని అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఇక పొదుపు మహిళలు, పింఛనుదారులు, వివిధ పథకాల లబ్ధిదారులు సీఎం సభకు రాకపోతే పథకాలు నిలిపివేస్తామని వలంటీర్లు హెచ్చరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.దూర ప్రాంతాల నుంచి వచ్చే జనానికి ఉదయం అల్పాహార ప్యాకెట్లు అందజేసే బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించినట్లు తెలిసింది. గురువారం నుంచే వెంకటగిరిలో పోలీసులు ఆంక్షలు విధించడంతో జనం ఇబ్బందులెదుర్కొంటున్నారు. సీఎం పర్యటించే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటుచేసి గంటల తరబడి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో జనం అసహనానికి గురవుతున్నారు.సీఎం రాక నేపథ్యంలో పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలల బస్సులను జనసమీకరణకు తీసుకెళ్లడంతో ఏమి చేయలేక సూళ్లు,కాలేజ్‌లకు సెలవు ఇవ్వాల్సి వచ్చిందని యాజమాన్యాలు అంటున్నాయి. సభాప్రాంగణం, హెలిప్యాడ్‌, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి విగ్రహ ఆవిష్కరణ ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని నిఘా కట్టుదిట్టం చేశారు.


Tags

Read MoreRead Less
Next Story