LOKESH: మరో హామీ నెరవేర్చాం: నారా లోకేశ్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ మెగా డీఎస్సీ మెరిట్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. ఏపీ మెగా డీఎస్సీ తుది ఫలితాల విడుదలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. మరో వాగ్దానం నెరవేరిందన్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన మొట్టమొదటి ఫైల్ మెగా డీఎస్సీ అని లోకేష్ గుర్తుచేసుకున్నారు. 150 రోజుల కంటే తక్కువ సమయంలో పాఠశాల విద్యా శాఖ ఏపీ మెగా డీఎస్సీ 2025ను విజయవంతంగా పూర్తిచేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తుది ఎంపిక జాబితాలో పేర్లు ఉన్న విజయం సాధించిన అభ్యర్థులందరికీ నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీల్లో ఒకటి మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేయడం.
ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల
ఏపీ మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఎంపికైన వారి వివరాలను మెగా డీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ఎంపిక జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టరేట్లలో డీఎస్సీ తుది జాబితాను చెక్ చేసుకోవచ్చు అని తెలిపింది.ఇకపోతే కూటమి ప్రభుత్వం 16347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాల భర్తీని చేపట్టింది.అయితే ఫైనల్ లిస్టును పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆయా జిల్లాల కలెక్టర్, డీఈవో కార్యాలయాలలో ప్రదర్శించింది. అంతేకాదు అధికారిక వెబ్సైట్ apdsc.apcfss.in లో కూడా అందుబాటులో ఉంచినట్లు డీఎస్సీ-2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు.
మిగిలిపోయిన పోస్టులు
మొత్తం 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అయితే 16 వేల పోస్టులకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయనుంది.కొన్ని మేనేజ్మెంట్లు, పలు సామాజిక వర్గాల్లో అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 347కు పైగా పోస్టులు మిగిలిపోయినట్లు అధికారులు వెల్లడించారు.తొలుత 600కు పైగా పోస్టులు మిగిలిపోయాయి. దీంతో వీలైనన్ని ఎక్కువ పోస్టులను భర్తీ చేసేందుకు ఏడు విడతలుగా ప్రభుత్వం సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించింది. ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. మెగా డీఎస్సీ వాగ్దానం నెరవేరిందని.. ఈ మైలురాయి తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. ఫైనల్ జాబితాలో లేని అభ్యర్థులు నిరుత్సాహపడొద్దని సూచించారు. హామీ ఇచ్చినట్లుగా ప్రతి ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు. దృఢ సంకల్పంతో ఉండండి.. డీఎస్సీకి సన్నద్ధమవ్వండి.. మీ అవకాశం కోసం ఎదురుచూడండి అని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com