Lokesh : దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తున్నారు : నారా లోకేష్

Lokesh : నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ముసునూరు గ్రామంలో వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు కరుణాకర్ కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు.. కరుణాకర్ చిత్రపటానికి నివాళులర్పించారు.. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు.. టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు లోకేష్.. జగన్ నాలుగో రాజధాని నెల్లూరు అంటూ ఘాటు విమర్శలు చేశారు.. దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.. నెల్లూరు జిల్లాలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు.. దళితులను మానభంగాలు, హత్యలు చేసిన వారికి ఒక్కరికైనా శిక్ష పడిందా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల చేతిలో అన్యాయాలకు గురైన వారికి ప్రైజ్ ట్యాగ్ తగిలిస్తూ రేటు కడుతున్నారంటూ లోకేష్ మండిపడ్డారు.
ఎమ్మెల్యే షాడో సుకుమార్ అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు లోకేష్.. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ హోంమంత్రి స్పందించడం లేదంటూ నిప్పులు చెరిగారు.. కేంద్రం, జాతీయ ఎస్సీ కమిషన్ చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాణి కండిషనల్ బెయిల్‌పై తిరుగుతూ క్రైమ్ క్యాపిటల్‌ను తయారు చేస్తున్నారంటూ లోకేష్ ధ్వజమెత్తారు.
అంతకు ముందు కావలి చేరుకున్న నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు టీడీపీ నేతలు, కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో కార్లు, బైక్‌లతో ర్యాలీ తీశారు.. ర్యాలీ మధ్య లోకేష్ కావలి చేరుకున్నారు. మద్దూరుపాడు జాతీయ రహదారి వద్ద నారా లోకేష్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. లోకేష్ రాకతో కావలి ప్రధాన రోడ్లన్నీ పసుపుమయమైయ్యాయి. దుగ్గిరాల కరుణాకర్ కుటుంబానికి పరామర్శ అనంతరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేస్తారు నారా లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com