LOKESH:అమరావతిలో భారత క్వాంటమ్ టెక్నాలజీకి పునాది

రాజధాని అమరావతి మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ఇది కేవలం ఒక సాధారణ భూమిపూజ కార్యక్రమం కాదని, భారతదేశ క్వాంటమ్ టెక్నాలజీ భవిష్యత్ నాయకత్వానికి పునాది వేస్తున్న కీలక సందర్భమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక క్వాంటమ్ వ్యాలీకి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శాస్త్రోక్తంగా భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. క్వాంటమ్ వ్యాలీలో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు 14 ప్రముఖ దేశీ, విదేశీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇది రాష్ట్రంలో భవిష్యత్ సాంకేతిక అభివృద్ధికి బలమైన సంకేతంగా భావిస్తున్నారు.
భూమిపూజ అనంతరం నిర్వహించిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రపంచం ఇంకా సాఫ్ట్‌వేర్ సేవల ప్రాధాన్యతను పూర్తిగా గ్రహించని దశలోనే భారత్‌లో ఒక దూరదృష్టి గల నాయకుడు కీలక ప్రశ్నను లేవనెత్తారని గుర్తు చేశారు. “హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాజధానిగా ఎందుకు తీర్చిదిద్దకూడదు?” అన్న ఆ ఒక్క ప్రశ్న దేశ ఐటీ చరిత్రనే మలుపుతిప్పిందని ఆయన అన్నారు. ఆ ఆలోచన ఫలితంగా మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయని, లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడినాయని వివరించారు.అది కేవలం ఒక నగర అభివృద్ధికే పరిమితం కాకుండా, ప్రపంచ పటంలో భారతదేశాన్ని ఐటీ విప్లవానికి కేంద్రంగా నిలబెట్టిందని లోకేష్ పేర్కొన్నారు. అదే దూరదృష్టితో ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీలకు గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో ఈ వ్యాలీ ద్వారా పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతాయని చెప్పారు. అమరావతిలో ప్రారంభమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా భవిష్యత్ సాంకేతిక దిశను నిర్దేశించే మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
