LOKESH: చిట్టి తల్లీ..నిశ్చింతగా చదువుకో..నీ బాధ్యత నాది

చిన్నారికి చదువుకోవాలని ఉంది. అయితే సీటు రాని కారణంగా, కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని పత్తి పొలంలో కూలీగా మారింది జెస్సీ అనే బాలిక. ఆ విషయం తన దృష్టికి రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆమెకు సీటుకు, చదువుకు భరోసా ఇచ్చారు. జెస్సీకి లోకేశ్ అండగా నిలిచారు. మంత్రాలయం మండలం బూదురుకు చెందిన జెస్సీ దీనస్థితిపై అధికారులతో ఆయన మాట్లాడారు. జెస్సీకి కేజీబీవీలో సీటు వస్తుందని.. నిశ్చింతగా చదువుకోవాలని లోకేశ్ తెలిపారు. పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు.. పత్తి చేనులో మగ్గడం బాధాకరమని పేర్కొన్నారు. విద్యకు పిల్లలను దూరం చేయొద్దని తల్లిదండ్రులను కోరారు. పిల్లల భద్రత-భవితకు భరోసానిచ్చే సురక్షిత ప్రదేశం బడికి మించి లేదని లోకేశ్ పేర్కొన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ‘‘చిట్టి తల్లీ.. నిశ్చింతగా చదువుకో.. కేజీబీవీలో సీటు ఇప్పించే బాధ్యత నాది’’ అని ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు చేశారు. "కేజీబీవీలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళుతున్న జెస్సీ కథనం నన్ను కదిలించింది. చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలు." అని లోకేశ్ ట్వీట్ చేశారు.
పొలాల్లో మగ్గడం బాధాకరం
"ఇప్పటికే అధికారులతో మాట్లాడాను. నీకు కేజీబీవీలో సీటు ఖాయం. నిశ్చింతగా చదువుకో. పుస్తకాలు పట్టాల్సిన చిన్న చేతులు పత్తి పొలాల్లో మగ్గిపోవడం చాలా బాధాకరం" అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు.. మనం నమ్మే విద్యా మందిరాలు అని చెప్పిన లోకేష్, పిల్లలకు అందిస్తున్న వసతుల వివరాలను పేర్కొన్నారు. “చక్కని యూనిఫాం, పుస్తకాలు, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్టు, అన్నీ ఉచితంగా ఇస్తున్నాం. సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు మంచిది నేర్పించి, భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత మాదే" అని నారా లోకేష్ తెలిపారు. మంత్రాలయం మండలం బూదూరుకు చెందిన మీనిగ కుమార్, సంతోషమ్మ దంపతులకు సంతానం ముగ్గురు. వీరి పెద్ద కుమారుడు నందవరం ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ 7వ తరగతి చదువుతున్నాడు. మూడో కుమార్తె మను వారి గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. రెండో కుమార్తె జెస్సీ గ్రామంలో 5వ తరగతి పూర్తి చేసింది. గ్రామంలో పై తరగతులు లేవు. కుటుంబానికి బారం కావడం ఇష్టం లేక తల్లిదండ్రుల వెంట కూలీ పనులకు వెళ్తోంది. ఈ చిన్నారికి లోకేశ్ అండగా నిలిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com