LOKESH: "కొత్త ఎమ్మెల్యేలకు మంచిచెడు తెలియట్లేదు"

తొలిసారి గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలకు మంచి చెడులు తెలియడం లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అవగాహనా రాహిత్యం, అనుభవ లేమితో సమన్వయం ఉండట్లేదని వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో ఆయన సమావేశం నిర్వహించారు. ‘‘సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలతో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలి. కొత్త ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే లోటుపాట్లు సరిచేసుకోవాలి. 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును విజయవంతం చేద్దాం’’ అని లోకేశ్ అన్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రతి మంత్రీ తమ శాఖల పరిధి ఒప్పందాలకు సంబంధించి బాధ్యతతో వ్యవహరిద్దామని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలని నారా లోకేశ్ సూచించారు. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలి.. లైన్లో పెట్టాల్సిన బాధ్యత మీదే అంటూ లోకేశ్ కీలక సూచనలు చేశారు.
హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వక దాడి
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం కల్తీ వ్యవహారం కాదని, హిందువుల విశ్వాసాలపై జరిగిన ఉద్దేశపూర్వక దాడి అని ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ వ్యవహారంలో నిజాలను బయటపెట్టిందని లోకేశ్ తెలిపారు. "ఇది కల్తీ కాదు.. హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి. మన నమ్మకాన్ని అపవిత్రం చేసే ప్రయత్నం. ఇది భరతమాత ఆత్మపై జరిగిన నేరం" అని ఆయన అభివర్ణించారు. దోషులు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లాలోని రాయలచెరువుకు గండి పడిన ఘటనలో బాధితులకు పరిహారం అందించనుంది. మొత్తం 960 కుటుంబాలకు పరిహారం అందించేందుకు రూ.3.23 కోట్లు నిధులు మంజూరు చేసింది. రాయల చెరువుకు గండిపడటంతో నష్టపోయిన 960 కుటుంబాలకు.. కుటుంబానికి మూడు వేల రూపాయలు చొప్పున ఈ పరిహారం అందించనున్నారు. ఈ నగదు సాయంతో పాటుగా నిత్యావసర వస్తువులు కూడా అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

