LOKESH: ప్రభుత్వ బడుల ముందు "నో అడ్మిషన్స్" బోర్డే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు 'నో అడ్మిషన్స్' బోర్డును చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఏడాది 100 పాఠశాలల్లో ఈ పరిస్థితిని సాధించామని, త్వరలోనే రాష్ట్రంలోని 42 వేల ప్రభుత్వ బడులను అదే స్థాయికి తీసుకెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శాసనసభలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మన బడి-మన భవిష్యత్తు’ కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని లోకేశ్ తెలిపారు. ‘‘యువగళం పాదయాత్ర సందర్భంగా ఉపాధ్యాయులు పలు సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేది మా లక్ష్యం. పాఠశాల భవనాల నిర్మాణం కోసం దాతల సహకారం కోరుతున్నాం. భవనాలపై దాతల పేర్లు ఉండేలా చూస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రావాలనేది మా ఉద్దేశం. అన్ని ప్రభుత్వ బడుల్లో సీట్లు నిండి ‘నో అడ్మిషన్’ బోర్డులు పెట్టాలనేదే నా లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు వంద బడుల్లో అలాంటి పరిస్థితి ఉంది’’ అని మంత్రి లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.117, 85లను ఈ ఏడాది మే 13న రద్దు చేసినట్లు లోకేశ్ తెలిపారు. ఈ జీవోలు ప్రాథమిక విద్యావ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారాయని, దీనివల్ల సుమారు 10 లక్షల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారని ఆయన అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉన్నతాధికారులతో 33 సమావేశాలు నిర్వహించి, ఆ జీవోలను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త జీవోలు 19, 20, 21 తీసుకొచ్చామని వివరించారు.
ప్రతి తరగతి గదికి ఓ టీచర్
'ప్రతి తరగతికి ఒక టీచర్' ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం రాకముందు కేవలం 1398 పాఠశాలల్లో ఈ విధానం అమల్లో ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను 9620కి పెంచామని చెప్పారు. అదేవిధంగా, గతంలో 124గా ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూళ్లను 729కి అప్గ్రేడ్ చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం 'మన బడి – మన భవిష్యత్తు' కార్యక్రమాన్ని ప్రారంభించామని లోకేశ్ తెలిపారు. దాతల నుంచి పారదర్శకంగా నిధులు సేకరించి, పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. బడులకు ఇప్పటికే స్టార్ రేటింగ్ విధానం ప్రవేశపెట్టామని, వాటిని మెరుగుపరిచే బాధ్యత స్థానిక శాసనసభ్యులపై ఉందని సూచించారు. దీంతో పాటు, నివాసానికి కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో పాఠశాల ఉన్న విద్యార్థులకు రవాణా ఖర్చుల కింద నెలకు రూ.600 చొప్పున పది నెలల పాటు అందిస్తామని ప్రకటించారు. ఈ ఏడాది సుమారు 70 వేల మంది విద్యార్థులకు ఈ ప్రయోజనం అందుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రైవేటు పాఠశాలలను మించి ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com