Nara Lokesh: దళితుడిపై వైసీపీ కార్యకర్తల దాడిని ఖండించిన లోకేష్..

Nara Lokesh: గుంటూరు జిల్లా పెదనందిపాడులో దళితుడిపై వైసీపీ కార్యకర్తల హత్యాయత్నం ఘటనపై టీడీపీ పోరాటానికి సిద్ధమైంది.. జాతీయ మానవహక్కుల సంఘంతోపాటు.. ఎస్సీ కమిషన్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.. వెంకట నారాయణపై జరిగిన దాడిని కమిషన్ల దృష్టికి తీసుకెళ్లారు ఆ పార్టీ నేతలు.. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు లేఖలో కోరారు. తమ పార్టీ దళిత కార్యకర్త వెంకట నారాయణపై వైసీపీ కార్యకర్తలు దాడిచేసి తీవ్రంగా హింసించారని లేఖలో పేర్కొన్నారు.. మద్యం సీసాలతో కొట్టి ఒంటికి నిప్పంటించారన్నారు. ప్రాథమిక హక్కులు కాపాడాలంటే ఘటనపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన నారాయణ ఫోటోలను కూడా ఫిర్యాదుకు జతజేసి ఎన్‌హెచ్‌ఆర్‌సీతోపాటు ఎస్సీ కమిషన్‌కు పంపించారు నక్కా ఆనంద్‌బాబు..
నిన్న కొప్పర్రుకు చెందిన టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నానికి తెగబడ్డారు వైసీపీ కార్యకర్తలు.. పెద్దకూరపాడులో అత్తింటికి వచ్చి వెళ్తున్న వెంకట నారాయణపై దాడికి తెగబడ్డారు.. పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు ప్రయత్నించారు.. బోయపాలెం సమీపంలోని ఓ వైన్ షాపు వద్ద ఈ ఘటన జరిగింది.. స్థానికుల సమాచారంతో బాధితుణ్ని గుంటూరులోని జీజీహెచ్‌కి తరలించారు బంధువులు. చంద్రబాబును అనరాని మాటలు అంటుంటే విని తట్టుకోలేక వారిని వారించానని.. అందుకే తనపై దాడిచేశారని బాధితుడు వెంకట నారాయణ చెప్పాడు. మద్యం సీసాలతో తలపై బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయానన్నాడు. అయితే, తనపై దాడిచేసింది కొందరు ముస్లిం యువకులని... వాళ్లలో ఒకరు బాచీ బాచీ అని పిలుస్తున్నాడని అన్నాడు..
అటు ఈ దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రంగా ఖండించారు. జగన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో చంద్రబాబును దూషిస్తోన్న వైసీపీ శ్రేణులను ప్రశ్నించడమే దళితుడైన వెంకటనారాయణ చేసిన నేరమా అని ప్రశ్నించారు. మద్యం సీసాలతో కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి.. రాక్షస మూకల మాదిరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తప్పును తప్పని చెబితే చంపేస్తారా.. మంచి చెప్పే మనుషుల ప్రాణాలే తీస్తారా అని ప్రశ్నించారు. రోజుకొకరు వైసీపీ పిశాచ ముఠాలకు బలవ్వాల్సిందేనా అని నిలదీశారు. ప్రభుత్వమే ఇవన్నీ చేయిస్తోందనేది సుస్పష్టమన్న లోకేష్.. అడ్డుకోవాల్సిన పోలీసులేమయ్యారని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com