LOKESH: ఇది తెలుగుదేశం 3.0.. పైరవీలతో పనిలేదు

తెలుగుదేశం పార్టీని కాలానికి అనుగుణంగా రూపాంతరం చెందించే దిశగా సమగ్ర మార్పులు చేపడుతున్నామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు సంస్థాగతంగా పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి టర్మ్‌లో కనీసం 33 శాతం కొత్తవారికి అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీకి తాజాదనం తీసుకురావాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తకు ఏ స్థాయి నుంచైనా పైస్థాయికి ఎదగడానికి అవకాశం ఉండాలని ఆయన వివరించారు. పార్టీ కేడర్‌ను చైతన్యవంతం చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో పాల్గొన్న లోకేష్, “కాఫీ కబుర్లు” పేరుతో బూత్ నుంచి క్లస్టర్ స్థాయి ఇన్‌చార్జీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రస్తుతం “టిడిపి 3.0” దశలోకి అడుగుపెట్టిందని, సాంకేతికతను వినియోగిస్తూ కేడర్ పనితీరును అంచనా వేస్తున్నామని తెలిపారు. సభ్యత్వ సంఖ్యను ఆధార్‌లా ఉపయోగిస్తూ ప్రతి కార్యకర్త పనిని గుర్తించగలుగుతున్నామని చెప్పారు. పైరవీలకు తావులేకుండా కృషి చేసిన వారికే పదవులు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని వెల్లడించారు.
పార్టీని మరింత బలోపేతం చేయడానికి శిక్షణా కార్యక్రమాలు కీలకమని లోకేష్ అభిప్రాయపడ్డారు. గ్రామ, మండల, యూనిట్ స్థాయిల్లో ఏడాది పొడవునా ఈ తరగతులు కొనసాగుతాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీని రాజకీయ విశ్వవిద్యాలయంతో పోల్చుతూ, ఇక్కడి నుంచి అనేక మంది నాయకులు దేశవ్యాప్తంగా ఎదిగారని గుర్తుచేశారు.
గతంలో కూడా ఇలాంటి శిక్షణా విధానాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు వాటిని మరింత విస్తృత స్థాయిలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పార్టీలో వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యమని లోకేష్ స్పష్టం చేశారు. “నేనే అన్న భావన” నాయకుల్లో ఉండకూడదని, పార్టీ మాత్రమే శాశ్వతమని ఆయన చెప్పారు. భవిష్యత్ నాయకత్వాన్ని తయారుచేయడం ప్రతి నాయకుడి బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో వ్యక్తులపై ఆధారపడటం వల్ల పార్టీకి నష్టం జరిగిందని, ఇకపై వ్యవస్థ ఆధారంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. దీర్ఘకాలంగా అధికారంలో నిలవాలంటే క్రమశిక్షణతో కూడిన కేడర్ అవసరమని, ఆ విషయంలో ఇతర జాతీయ పార్టీల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయని సూచించారు. తన రాజకీయ అనుభవాన్ని పంచుకున్న లోకేష్, మంగళగిరి నియోజకవర్గంలో ఎదుర్కొన్న ఓటమి తర్వాత కృషితో సాధించిన విజయాన్ని ఉదాహరణగా చెప్పారు. భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ, ఇంకా బలహీనంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో సమస్యలు ఉంటే వాటిని అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోవాలని, విభేదాలు బయటపడితే పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
