Nara Lokesh: యలమంచిలిలో హోరెత్తుతున్న లోకేష్ యువగళం

నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర యలమంచిలికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని వీధులన్నీ టీడీపీ కార్యకర్తలతో కిటకిటలాడాయి. ప్రధాన రహదారి, రోడ్లకు ఇరువైపులా జనం బారులు తీరారు. అడుగడుగునా యువనేతకు నీరాజనాలు పడుతూ మహిళలు సంఘీభావం తెలిపారు. కాగా.. పన్నులపోటు, పెరిగిన ధరలతో బతుకుబండి లాగలేకపోతున్నామని మహిళల ఆవేదన వ్యక్తం చేస్తూ యువనేతకు తమగోడును వెలిబుచ్చారు. మరో 3నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం పన్నులతోపాటు ధరలను అదుపుచేసి ఉపశమనం కలిగిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు.
వెనుకబడిన తరగతులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు ఊతమిచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం ఆయన విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా గవర సామాజిక వర్గ నేతలతో ముఖాముఖి నిర్వహించారు. కేవలం వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. గవర కార్పొరేషన్కు వైసీపీ సర్కారు ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పారు. గవర సామాజిక నేతలు ఏకరువు పెట్టిన సమస్యలపై లోకేష్ స్పందిస్తూ టీడీపీ ప్రభుత్వం రాగానే గవర కార్పొరేషన్ను బలోపేతం చేస్తామని హామీనిచ్చారు. వైసీపీ సర్కారు పాలనలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించినట్లు గుర్తు చేశారు. మరో నాలుగు నెలల్లో జగన్ దుర్మార్గ పాలనకు తెరపడుతుందని చెప్పారు. టీడీపీ అధికారానికి రాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని హామీనిచ్చారు. స్కిల్ డెవలప్మెంటు ద్వారా బీసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు.
అడ్డగోలుగా దోచుకోవడమే పనిగా రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెత్తారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే బెదిరింపులు, అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. ఎలమంచిలి కొత్తూరు క్యాంప్ సైట్ నుంచి 222వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. ఎలమంచిలిలో విశ్రాంత ఉద్యోగులతో యువనేత సమావేశమై వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో మొదటి బాధితులు ఉద్యోగులేనని లోకేష్ చెప్పారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డుపైకి నెట్టిందని విమర్శించారు.
దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. నారాయణపురంలో గవర సామాజిక వర్గీయులతో లోకేష్ సమావేశమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా పాలనలో బీసీలపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. 26 వేల మంది బీసీలపై అక్రమంగా కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com