ఆంధ్రప్రదేశ్

విశాఖలో రెచ్చిపోయిన మరో ప్రేమోన్మాది

విశాఖలో రెచ్చిపోయిన మరో ప్రేమోన్మాది
X

విశాఖపట్టణంలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమిస్తున్న యువతి మరో యువకుడితో చనువుగా ఉంటుందనే అనుమానంతో కత్తితో దాడి చేశాడు. అనంతరం తాను కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలపాలైన యువతి ప్రస్తుతం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.

వన్‌టౌన్ లోని ఫెర్రీ వీధిలో శ్రీకాంత్, ప్రియాంక పక్క పక్క ఇంట్లో నివసిస్తున్నారు. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల ప్రియాంక మరొకరితో చనువుగా ఉంటుందనే అనుమానంతో శ్రీకాంత్ యువతిపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. అనంతరం తాను కూడా స్వల్పంగా గొంతు కోసుకున్నాడు. ఈ హఠాత్ పరిణామంతో ప్రియాంక కేకలు వేస్తూ బయటకు పరిగెత్తింది. కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.

తమ కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్తుంటే శ్రీకాంత్ మరింత ఉన్మాదిలా ప్రవర్తించాడని బాధితురాలి తల్లి వాపోయింది. నీ కూతురిని చంపేశాను అంటూ తనకే చెప్పాడని కన్నీరు పెట్టుకుంది. కొన్నిరోజులుగా పెళ్లి పేరుతో ఒత్తిడి తెచ్చాడని..అయితే ఇలా ప్రాణాలు తీస్తాడనుకోలేదని ఆవేదన వ్యక్తంచేసింది.

వన్ టౌన్ ఏరియాలో బుధవారం ఉదయం 8 గంటల45 నిమిషాలకు ఈ దాడి జరిగిందని డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. ప్రియాంక-శ్రీకాంత్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని.. ఇరు కుటుంబాల మధ్య 20ఏళ్లుగా పరిచయం ఉందన్నారు. ఆరు నెలల క్రితం పెళ్లి విషయంపై ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయన్నారు. శ్రీకాంత్ కోలుకున్న తర్వాత పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించారు.

మరోవైపు ఈ కేసులో దిశ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. శ్రీకాంత్ యువతి మీద కక్షతోనే దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Next Story

RELATED STORIES