PINNELLI: పోలీస్‌ కస్టడీకి పిన్నెల్లి

PINNELLI: పోలీస్‌ కస్టడీకి పిన్నెల్లి
రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ మాచర్ల కోర్టు ఆదేశాలు... నెల్లూరు జైల్లోనే విచారణ..

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు.. పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేసిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెండు రోజులు పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ మాచర్ల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసు సహా మరికొన్ని కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్‌ జైలులో ఉన్న పిన్నెల్లిని పోలీస్‌ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లిని ఈనెల 8, 9 తేదీల్లో నెల్లూరు జైల్లోనే విచారణ చేసేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. కారంపూడిలో సర్కిల్ ఇన్స్పెక్టర్‌పై దాడితో పాటు, పాలవాయి గేట్‌లో ఓ వ్యక్తిపై హత్యాయత్నం కేసులో పూర్తి దర్యాప్తు కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రోజు చొప్పున, రెండు రోజుల పాటు పోలీసులు విచారణ చేసేందుకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిన్నెల్లిని నెల్లూరు జైల్లో సీసీ కెమెరాలు, పిన్నెల్లి తరపు న్యాయవాదుల సమక్షంలో విచారణ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. డీఎస్పీ స్థాయి అధికారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి విచారణ చేయవచ్చని న్యాయస్థానం అనుమతినిచ్చింది.

జగన్‌ మాచర్లకు రా...

మాచర్లలో ప్రజావేదికను ఏర్పాటు చేస్తానని, వేదికకు పిన్నెల్లి బ్రదర్స్‌ బాధితులను పిలిపిస్తానని, వారి మంచితనం ఏమిటో చూసేందుకు వస్తారా అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సవాల్‌ విసిరారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జిల్లా జైలులో పరామర్శించిన అనంతరం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రౌడియిజం, ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయించటం, వేధింపులకు గురిచేయటం, దౌర్జన్యం, దోపిడి, ఆక్రమాలు చేసేవారు వైసీపీ భాషలో మంచివారా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో విధ్వంసం చేసి, అప్పుల పాలు చేసిన వారికి ప్రస్తుత ప్రభుత్వం అధికారం చేపట్టిన నెలలోనే పథకాలు అమలు చేయలేదంటూ విమర్శించటానికి నోరెలా వచ్చిందన్నారు.

రూ.8.5 లక్షల కోట్ల అప్పు, తవ్వే కోద్ది పెరుగుతున్న అప్పులు, అవినీతి, ఆక్రమాల చిట్టా, ప్రజల నెత్తిన పన్నుల వడ్డణ, ధరల స్థిరీకరణకు నిధికి రూ.3,500 కోట్ల కేటయించకపోవడం వంటివి మర్చిపోయి జగన్‌ మాట్లాడుతున్నారని, ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. ఉపాధి హమీ పనులు చేపట్టకుండా శ్రామికులను నష్టపర్చినారని, ఇసుక సరిగా ఇవ్వకుండా భవన నిర్మాణ కార్మికులను ఇబ్బంది పెట్టారని, అమరావతిపై తప్పుడు ప్రచారంతో రియల్‌ ఎస్టేట్‌ను దెబ్బతీశారని, భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేకుండా చేశారని దుయ్యబట్టారు.

Tags

Next Story