MLA Pinnelli: ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి

MLA Pinnelli: ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి
X
వెలుగులోకి సీసీ కెమెరా దృశ్యాలు

పిన్నెల్లి వంటి వ్యక్తి శాసనసభ్యుడైనందుకు సభ్యస మాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. మాచర్ల నియోజకవర్గాన్ని తన అరాచకాలతో రావణకాష్టంలా, బందిపోట్లకు నిలయమైన ఒకప్పటి చంబల్లోయలా మార్చేసిన పిన్నెల్లి..అక్కడ ఎంత పేట్రేగిపోతున్నారో చెప్పేందుకు బయటపడుతున్న కొన్ని వీడియోలే నిదర్శనం. రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటు.... తెదేపాకు గట్టి పట్టున్న గ్రామం. పోలింగ్ రోజున అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయన్న ఉక్రోషంతో ఎమ్మెల్యే తన అనుచరగణాన్ని వెంటేసుకుని బూత్లోకి దూసుకెళ్లారు. శాసనసభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్న కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఈవీఎంను రెండు చేతులతో ఎత్తి నేలకేసి బలంగా కొట్టారు. EVMతోపాటు, వీవీప్యాట్ కూడా కింద పడి ధ్వంసమయ్యాయి. వాటిని తన్నుకుంటూ తెదేపా ఏజెంట్‌కు వేలు చూపించి బెదిరిస్తూ ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు.

నిబంధనలకు విరుద్ధంగా MLA అనుచరుల్ని వెంటేసుకుని పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్తున్నా పోలీసులు, పోలింగ్ సిబ్బంది అడ్డుకోలేదు. ఆయన పోలింగ్ బూత్లోకి రాగానే సిబ్బంది లేచి నిలబడి నమస్కారం కూడా పెట్టారు. ఆయన నేరుగా పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టారు. తెదేపా ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లారు. ఆయన అనుచరుల్లో ఒకరితో కలబడి పిడిగుద్దులు గుద్దారు. ఎమ్మెల్యేపైకి కూడా విసురుగా వెళుతుంటే ఆయన అనుచరులు గట్టిగా పట్టుకుని ఆపేశారు. ఈ ఘటనతో పోలింగ్ సిబ్బందితో పాటు, ఓటర్లు భీతావహులయ్యారు. ఎమ్మెల్యే ఈవీఎంను విసిరికొడుతున్న సమయానికి... మహిళా పోలింగ్ సిబ్బంది భయంతో ఒక మూలకు వెళ్లిపోవడం సీసీ కెమెరాలో రికార్డయింది. ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేసి బయటకు వచ్చాక ఆయన అనుచరులు రెచ్చిపోయారు. తెదేపా కార్యకర్తలపై రాళ్ల వర్షం కురిపించారు. నంబూరి శేషగిరిరావుపై దాడి చేయడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. శేషగిరిరావు సహా తెదేపాలో కీలకంగా వ్యవహరించిన కొందరు..MLA ఆయన అనుచరుల ఆరాచకాలకు భయపడి ప్రస్తుతం అజ్ఞాతంలో కాలం గడుపుతున్నారు.

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందరూ చూస్తుండగా.. ఈవీఎంను ధ్వంసం చేస్తే ఆ ఘటనపై పోలీసులు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంను ధ్వంసం చేశారని కేసు నమోదు చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో రెండు బూతులు ఉన్నాయి. 1,464 మంది ఓటర్లు ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఇదీ ఒకటి. కానీ పోలింగ్ రోజున అక్కడున్నది కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లు. MLA వచ్చి ఈవీఎం పగలగొట్టినా, తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వుతూ అరాచకం సృష్టించినా చోద్యం చూడటం తప్ప ఆ కానిస్టేబుళ్లు చేసిందేమీ లేదు. పల్నాడు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, 34 కంపెనీల బలగాలు కావాలని జిల్లా అధికారులు కోరితే 19 కంపెనీల్ని మాత్రమే ఇచ్చి సర్దుకోమన్నారు. పోలింగ్ రోజున MLA అరాచకాలకు అడ్డూ ఆపూ లేకుండా పోవడానికి అదీ ఒక కారణమైంది.

Tags

Next Story