AP: పిన్నెల్లి ప్రధాన అనుచరుడు అరెస్ట్‌

AP: పిన్నెల్లి ప్రధాన అనుచరుడు అరెస్ట్‌
X
వైసీపీ హయాంలో అరాచకం సృష్టించిన తురకా కిషోర్.. కిషోర్‌పై పలు కేసులు..

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఉన్న తురకా కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కిశోర్‌ అనేక అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మాచర్లకు వెళ్లిన టీడీపీ నేతలు బొండా ఉమా మహేశ్వరరావు, బుద్ధా వెంకన్నపై దాడికి పాల్పడిన ఘటనలోనూ తురకా కిషోర్‌పై ఆరోపణలున్నాయి. అప్పట్లో తురకా కిషోర్ కారు అద్దాలు బద్దలు కొట్టి టీడీపీ నేతలపై దాడికి యత్నించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వైసీపీ హయాంలో పలు అరాచకాలు

వైసీపీ ప్రభుత్వంలో పలు అరాచకాలకు పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న కిశోర్‌ను అరెస్ట్ చేశారు. కిశోర్‌పై మూడు హత్యాయత్నం కేసులతో పాటు పలు దాడి కేసులున్నాయి. మల్కాజిగిరిలోని జయపురికాలనీలో కిశోర్‌ను విజయపురి సౌత్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. టీడీపీ నేతల వాహనాలపై దాడి చేస్తున్న ఫొటోలు, వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో దాడులకు పాల్పడిన అనంతరం తురక కిశోర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మాచర్ల అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలతో గత ఏడాది ఏడాది మే నెలలో పిన్నెల్లి సోదరులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అప్పటినుంచి వారి ప్రధాన అనుచరుడు కిశోర్ జాడ సైతం పోలీసులకు దొరకలేదు. ఏపీలో ఎన్నికల అనంతరం పిన్నెల్లి సోదరులు ఏపీని వీడటంతో వారి అనుచరుడు కిశోర్ బెంగళూరుకు వెళ్లి తన సోదరుడు శ్రీకాంత్ వద్ద ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ వస్తున్నాడన్న సమాచారం జయపురి సౌత్ ఎస్సై షఫీ టీమ్ నగరానికి వచ్చింది. వైసీపీ నేత కిశోర్‌తో పాటు అతడి సోదరుడు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని మాచర్లకు తీసుకొచ్చి ఓ రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నారు. నేడు (సోమవారం) కిశోర్, అతడి సోదరుడ్ని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.

బొండా ఉమ కారుపై దాడి

స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు నామినేషన్లు వేయనీయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీనిపై పరిశీలకులుగా టీడీపీ తరఫున బొండా ఉమ, బుద్ధా వెంకన్నలను చంద్రబాబు అక్కడికి పంపారు. మాచర్ల సాగర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే వీరి వాహనంపై దాడికి దిగారు. ఈ క్రమంలో పెద్ద కర్రతో కిశోర్ టీడీపీ నేతల వాహనంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం కిశోర్‌ను మాచర్ల మున్సిపల్ ఛైర్మన్‌ను చేయగా రెండేళ్లు ఆ పదవిలో కొనసాగారు.

Tags

Next Story