కోరిక తీరింది.. ప్రాణం పోయింది.. విశాఖలో విషాదం

చిన్న కూతురి పెళ్లి చేయలేదు.. బాధ్యత నెరవేర్చకుండానే పోతానేమో అని కన్నతండ్రి కన్నీరు మున్నీరయ్యాడు.. గుండె పట్టుకుని గుండెలవిసేలా రోదించాడు.. ఆపరేషన్ చేయించుకున్నా అతడి ఆరోగ్యం కుదుట పడలేదు.. పెద్దాయన కోరిక తీర్చే నిమిత్తం కూతురి పెళ్లి చేశారు కుటుంబసభ్యులు.. కూతురి పెళ్లి చూసిన ఆనందంతో ఆ రోజు రాత్రే కోమాలోకి వెళ్లిపోయారు. ఈ విషాద సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
జిల్లాలోని అచ్యుతాపురం మండలం చోడపల్లికి చెందిన నారాయణరావుకు గుండెనొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు.. పరిస్థితి సీరియస్‌గా ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు వైద్యులు. ఆపరేషన్ అనంతరం వైద్యుల పర్యవేక్షణలోనే ఉండి మూడు నెలలుగా విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నారాయణరావుకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దమ్మాయికి వివాహం చేశారు. కానీ చిన్నకుమార్తె వివాహం చూడాలనేది నారాయణరావు చివరి కోరిక. ఈలోపే అనారోగ్యం పాలయ్యాడు.
దాంతో ఆయన కోరిక మేరకు రాంబిల్లి మండలం లాలంకోడూరుకి చెందిన అతడి మేనల్లుడితో కూతురు వివాహం నిశ్చయించారు. నారాయణరావు సమక్షంలో ఇద్దరికీ వివాహం జరిపించారు. కూతురి వివాహం చూసిన నారాయణరావు ఆ రోజు రాత్రి కోమాలోకి వెళ్లిన కొద్దిసేపటికే ప్రాణాలు విడిచారు. తన చివరి కోరికను తీర్చుకునేందుకు ప్రాణాలు నిలబెట్టుకున్న నారాయణరావు.. ఆ కోరిక తీరగానే కోమాలోకి వెళ్లి పోయి మృతి చెందడం కుటుంబసభ్యులను తీవ్రంగా కలచివేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com