Mandous Cyclone in Tirupati: తిరుపతిలో 'మాండూస్' బీభత్సం..
Mandous Cyclone in Tirupati: తిరుపతిలో మాండూస్ బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. జైభీంనగర్, కెనడీనగర్, లక్ష్మీపురం సర్కిళ్లలోని ఇళ్లలోకి వరద వచ్చి చేరింది. రాత్రి నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాగ్రి మొత్తం తడిసిపోయింది. అటు.. జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. పట్టించుకున్న ప్రజాప్రతినిధులు లేరని వాపోతున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తిరుమలలోని జలాశయాలకు జలకళ సంతరించుకుంది. తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం పడుతుంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడుతున్నాయి. విరిగిపడ్డ కొండచరియలను తొలగిస్తున్నారు. తిరుమలలో చెట్టు కూలి మహిళకు గాయాలయ్యాయి.
అటు.. పాపవినాశనం వద్ద 255 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. స్వర్ణముఖి నదికి భారీగా వరద వస్తుంది. ఏర్పేడు కొత్తవీరాపురం వద్ద కాజ్‌వే పైకి నీరు వచ్చింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కైవల్యానది ఉధృతంగా ప్రవహిస్తుంది. గూడూరు రహదారిపై బ్రిడ్జి నీటమునిగింది. భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్ర తీర ప్రాంత మండలాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇక.. ఒంగోలు, కొండెపి, కనిగిరి, ఎస్‌ఎస్ పాడు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. అటు.. కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డు కోతకు గురైంది. నేమాం వద్ద రోడ్డు కొట్టుకుపోయింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com