Lokesh Nomination: దుమ్మురేపిన నారా లోకేష్ నామినేషన్ ర్యాలీ
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. తెదేపా సమన్వయకర్త నందం అబద్ధయ్య, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, రేఖా సుధాకర్‌గౌడ్, ఎండీ ఇబ్రహీం తదితరులు ఒక సెట్ అందజేశారు. మరో సెట్‌ను పోతినేని శ్రీనివాసరావు, వేమూరి మైనర్‌బాబు, భాజపా సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి సమర్పించారు.
నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలను అందించారు. ఇక ఆలయం వెలుపల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు సర్వమత ప్రార్థనలు జరిపారు. ఆలయం నుండి భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలుకు బయలుదేరారు. దాదాపు పదివేల మంది కార్యకర్తలు, అభిమానులు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు.
మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో లోకేష్ తరఫున స్థానిక నేతలు నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికలలో లోకేష్ ను గెలిపించాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు, యువత తోపాటు ప్రజలు తరలివచ్చారు.
మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్ ర్యాలీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు లోకేష్ ను ఆదరిస్తున్నారని, ర్యాలీ సందర్భంగా అడుగడుగునా మహిళలు, పట్టణ ప్రజల నీరాజనాలు పలుకుతున్నారని తెలుగుదేశం ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. నియోజకవర్గం నలుమూలల నుంచి ద్విచక్ర వాహనాలపై తరలివచ్చిన వేలాదిమంది టిడిపి-జనసేన-బిజెపి కార్యకర్తలు లోకేష్ కోసం ముందుకు సాగుతున్నారని, మిద్దెసెంటర్, వైష్ణవి కళ్యాణమండపం, పాతబస్టాండు మీదుగా కొనసాగుతున్న ర్యాలీలో భారీగా కూటమినేతలు పాల్గొన్నారని టిడిపి పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com