Jatwani: మలుపులు తిరుగుతున్న జత్వానీ కేసు, తాజాగా తెరపైకి మహిళా ఎస్ ఐ పేరు

Jatwani: మలుపులు తిరుగుతున్న జత్వానీ కేసు, తాజాగా తెరపైకి మహిళా ఎస్ ఐ పేరు
X
నటిని కడుపులో తన్ని చిత్రహింసలు

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు మలుపులు తిరుగుతున్న కొద్దీ సంచలన విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడగా తాజాగా ఆమె పట్ల క్రూరంగా వ్యవహరించిన ఒక మహిళా ఎస్ఐ పేరు బయటకొచ్చింది. ఈ మహిళా ఎస్ ఐ.. కాదంబరీ జత్వానీ పొట్టలో కాలుతో బలంగా తన్నినట్లు తెలుస్తోంది. జత్వానీని ఇబ్బందులు పెట్టిన ఎస్ఐని‌ పోలీసు అధికారులు కాపాడుతున్నారు. అలాగే మహిళలపై దాడులు చేశారంటూ మరో వ్యక్తిపై గతంలో తప్పుడు కేసులు పెట్టినట్లు ఈ ఎస్ఐపై ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎస్ఐపై బాధితులు రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆ సబ్-ఇన్‌స్పెక్టర్‌పై దర్యాప్తునకు రాష్ట్రపతి ఆదేశించినా.. సిపి కాంతిరాణా టాటా ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. నటి జిత్వానీని కూడా ఈ మహిళ ఎస్.ఐ తీవ్రంగా కొట్టినట్లు పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చింది.

ముగ్గురు ఐపీఎస్ల లపై వేటు..

ఈ కేసులో ఐపీఎస్‌ అధికారులమనే విషయాన్ని మరిచి జగన్‌ ప్రభుత్వంలో అడ్డగోలు పనులు చేసిన అధికారుల పాపం పండింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా చెలరేగిన ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై వేటు పడింది. ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా తాతా, విజయవాడ మాజీ డీసీపీ విశాల్‌ గున్నీని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. జెత్వానీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విజయవాడ పోలీసులు ఇచ్చిన నివేదికను డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రభుత్వానికి నివేదించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేస్తూ జీవో 1590, 1591, 1592 విడుదల చేసింది.

పక్కా కుట్రతోనే కేసు

మాజీ సీఎం జగన్‌ స్నేహితుడు సజ్జన్‌ జిందాల్‌పై కాదంబరి పెట్టిన కేసు నుంచి కాపాడేందుకు ఆమెను అక్రమ కేసులో ఇరికించి నరకం చూపించారు. వైసీపీ పెద్దల ఆదేశాల మేరకు ఐపీఎస్‌లు పీఎస్‌ఆర్‌, కాంతిరాణా, విశాల్‌ గున్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్‌ చేసి టార్చర్‌ పెట్టారు. ఈ ముగ్గురు ఐపీఎస్‌లపై గతంలో కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రానికి డీజీపీ కావాలనే ధ్యేయంతో ప్రతిపక్ష పార్టీల నేతల్ని హింసించడం, ప్రశ్నించే గొంతుకల్ని నొక్కేయడం, తప్పుడు కేసులతో వేధించడం లాంటి అడ్డగోలు పనులు చేసినట్టు ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై విమర్శలు ఉన్నాయి. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి దొంగ ఓట్లు వేయించడం నుంచి బెజవాడలో అడ్డమైన పనులు చేయడం వరకు కాంతిరాణాపై ఆరోపణలు ఉన్నాయి. పోస్టింగ్‌ కోసం రాజధాని రైతుల్ని హింసించడం మొదలు దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత నాడు గుంటూరు ఎస్పీగా విశాల్‌ గున్నీ ఎన్నో సార్లు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎస్‌ అధికారులుగా చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు జగన్‌ ప్రభుత్వంలో వైసీపీ చట్టాన్ని అమలు చేశారని పలువురు విమర్శిస్తున్నారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు నుంచి అనంతపురంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి వరకూ.. హైదరాబాద్‌లో రఘురామ రాజు నుంచి నంద్యాలలో చంద్రబాబు వరకూ ఎవరిని అక్రమంగా జైలుకు పంపాలన్నా పీఎస్ ఆర్ ఆంజనేయులుదే కీలక పాత్రన్న విమర్శలు ఉన్నాయి.

Tags

Next Story