మార్కెట్లో మటన్ ధరను చూసి విస్తుపోయిన విజిలెన్స్ అధికారులు..

మార్కెట్లో మటన్ ధరను చూసి విస్తుపోయిన విజిలెన్స్ అధికారులు..
కొనుగోలుదారుల ఆరోగ్యం గురించి వాళ్లకేం పట్టదు.

వయసు మీరిన మేక.. ధర ఎంతో చవకని తీసుకొస్తున్నారు మాంసం దుకాణదారులు. దాన్ని వధించి మటన్ కొట్టి మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్మి డబ్బు సంపాదనే ధ్యేయంగా విక్రయాలు సాగిస్తున్నారు.. కొనుగోలుదారుల ఆరోగ్యం గురించి వాళ్లకేం పట్టదు.. ఇటీవల విజయవాడ నగర పాలిక అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు అనేకం వెలుగు చూశాయి. 10, 15 రోజుల క్రితం తెచ్చిన మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టి అడిగే వాళ్లు లేరని దర్జాగా అమ్మేస్తున్నారు.

గత వారం విజయవాడలోని బార్బిక్యూ రెస్టారెంట్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫ్రిజ్‌లో ఏకంగా 150 కిలోల మటన్ నిల్వ ఉంచారు. అది కూడా 15 రోజుల నాటిది.. గడ్డకట్టుకుపోయి కుళ్లిపోయే దశకు చేరుకున్న మటన్ ధర కిలోకు రూ.480 లెక్కన అమ్మకాలు సాగిస్తున్నారు.. బయట మార్కెట్లో కిలో రూ.800 ధర పలుకుతున్న మటన్ ఇక్కడ రూ.400 లకే ఎలా దొరుకుతుంది అనే అంశంపై దృష్టి సారించి తనిఖీలు నిర్వహించారు అధికారులు.

నాలుగు రోజుల క్రితం బెజవాడలోని గొల్లపాలెం గట్టు ప్రాంతంలోని ఓ మాంసం విక్రయశాలపై కార్పొరేషన్ ఆరోగ్య విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడి ఫ్రిజ్ తెరిచి చూసిన అధికారులకు నోట మాటరాలేదు. పురుగులు పట్టిన మాంసం, తుప్పు పట్టిన కూలింగ్ మిషన్ వంటి వాటిపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఈ దాడుల్లో వారికి 400 కిలోల మాంసం దొరికింది.

ఆరోగ్యంతో ఉన్న జంతువుల కంటే వయసు మీదపడిన, అనారోగ్యంతో ఉన్న జంతువులైతే తక్కువ ధరకు వస్తాయని వాటిని కొనుగోలు చేసి మటన్ కొట్టి అమ్మకాలు సాగిస్తున్న విషయం తెలుసుకున్నారు. ప్రకాశం, నల్గొండ, గుంటూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం సంతలు జరుగుతుంటాయి.

అక్కడ కొనుగోలు చేసిన మేకలను శనివారం రాత్రికి విజయవాడకు తెస్తున్నారు. వైద్యుడి ధ్రువీకరణ లేకుండానే, అనధికారికంగా వధించి మామూలు మాంసంతో కలిపి అమ్మేస్తున్నారు. ఈ మాంసాన్నే హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు తక్కువ ధరకు వస్తుందని కొనేస్తున్నారు. వాళ్లింకా ఎక్కువ పరిమాణంలో కొని ఫ్రిజ్‌లలో నిల్వ చేసి కస్టమర్లకు వండి వడ్డిస్తున్నారు.

ఎన్ని నిబంధనలు ఉన్నాయి.. ఎవరికి తెలుసని..

ఆదివారం వస్తే అంగడికి వెళ్లడం తెలుసుకాని ఇన్ని నిబంధనలు ఉన్నాయని.. ఏ ఒక్కరైనా పాటిస్తున్నారా లేదా అని అడగాలని కానీ పౌరులకు లేకపోవడం శోచనీయం.

ఎఫ్ఎష్ఎష్ఏఐ చట్టం ప్రకారం పాటించాల్సిన నిబంధనలు ఇవీ..

* ఏదైనా జంతువును వధించాలంటే తప్పనిసరిగా యాంటీమార్టం చేయాలి. 48 గంటల ముందు సంబంధిత కబేళాలోని పశువైద్యుడు పరీక్షించాలి. ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించి, ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి.

* దీని ఆధారంగా కబేళాకు తీసుకు వెళితే అక్కడ ముద్ర వేసి జంతువును వధిస్తారు. తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించి, ఆరోగ్యంగా ఉందీ లేనిది చెప్పాలి.

* కళేబరాన్ని మాంసపు దుకాణానికి తీసుకువచ్చి అమ్మకాలు చేపట్టాలి. ఒకవేళ ఆరోజు వధించిన మాంసం మిగిలితే దానిని 18 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కొన్ని గంటల పాటు భద్రపరచాలి. అంతకు మించి ఉంచకూడదు.

* తరచు ఆరోగ్య అధికారులు దాకాణాలను పరిశీలించాలి. ముద్ర ఉన్న జంతువు మాంసాన్నే విక్రయిస్తున్నారా లేదా అన్నది గమనించాలి.

సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచని మాంసం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు అంటున్నారు. సైన పద్ధతిలో నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా, వైరస్ వృద్ధి చెందుతాయని తెలిపారు. రెండు, మూడు రోజుల కంటే ఎక్కువగా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకూడదు. మాంసాహార వంటకాలను సరిగా వండకుండా తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. వాంతులు, విరోచనాలు, జ్వరం వస్తాయి. ఉదర సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

ముదిరితే కిడ్నీలు, లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. చిన్నారులు, వృద్దులు, గర్భిణుల్లో ప్రాణాపాయ స్థితి వరకు వెళ్లే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. మంచి మాంసానికి వాసన ఉండదు. గులాబీ రంగులో ఉంటుంది. అదే నిల్వ ఉన్న మాంసం అయితే దుర్వాసన వస్తుంది. పట్టుకుంటే జిగటగా ఉంటుంది. నీలి, గోధుమ రంగులో కనిపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story