MEDIGADDA: మేడిగడ్డపై ప్రభుత్వానికి విజిలెన్స్‌ నివేదిక

MEDIGADDA: మేడిగడ్డపై ప్రభుత్వానికి విజిలెన్స్‌ నివేదిక
X
అధికారులు.. గుత్తేదారు కుమ్మక్కయ్యారని స్పష్టీకరణ.. ఖజానాకు తీవ్ర నష్టం కలిగించే కుట్ర పన్నారని ఆరోపణ..

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నాణ్యతా పరీక్షలు సరిగా చేయలేదని.. నాణ్యతకు సంబంధించిన రికార్డులు మాత్రం సృష్టించారని.. కొన్ని పరీక్షలు చేయకుండానే చేసినట్లుగా రాశారని...విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తెలిపింది. పాత తేదీలతో ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని.. నాణ్యత ధ్రువీకరణ పరీక్షలు చేయకుండానే బిల్లులు చెల్లించడానికి అనుమతించారని తెలిపారు. బాధ్యులైన ఇంజినీర్ల వివరాలు పేర్కొంటూ వారిపైన, గుత్తేదారుపైన కూడా క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేపట్టాలని సిఫార్సు చేసిందని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వెల్లడించింది. బ్యాంకు గ్యారంటీలను తిరిగి చెల్లించడం, పని పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం... ఇలా అన్నింటిలో గుత్తేదారుతో ఇంజినీర్లు కుమ్మక్కయారని... దాంతో బ్యారేజీకి నష్టం వాటిల్లిందన్నారు. పని పూర్తయిన తర్వాత కాఫర్‌డ్యాం, దాని అనుబంధ షీట్‌పైల్స్‌ను తొలగించడంలో అధికారులు నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడ్డారని తెలిపారు. డీవాటరింగ్‌కు సంబంధించిన రికార్డులే లేవు. కానీ అంచనా మాత్రం భారీగా పెంచారని కొద్ది రోజుల క్రితం కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జ్యుడిషియల్‌ కమిషన్‌కు ఈ నివేదిక అందజేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌... తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది.


మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సమయంలో క్షేత్రస్థాయి ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్లు నిబంధనలపై ఏ మాత్రం దృష్టి కేంద్రీకరించలేదని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తెలిపింది. భారీ, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో వ్యవహరించాల్సినట్లుగా వ్యవహరించలేదని.. వారి నిర్లక్ష్యం వల్ల బ్యారేజీకి భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలగజేసే పెద్ద కుట్ర ఇందులో ఇమిడి ఉందని వివరించింది. ఇంజినీరింగ్‌ అధికారులు, గుత్తేదారు కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారు. ఒప్పందం ప్రకారం అవసరమైన పరీక్షలను క్వాలిటీ కంట్రోల్‌ విభాగం చేయలేదు. బ్యారేజీ వైఫల్యానికి ఇది కూడా ఓ ప్రధాన కారణమన్నారు క్వాలిటీ కంట్రోల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ మొత్తం నిర్మాణ సమయంలో 2017 ఏప్రిల్‌ 15న ఒకసారి మాత్రమే తనిఖీ నివేదిక ఇచ్చారు.

క్వాలిటీ కంట్రోల్‌ ఎస్‌ఈ 2017 సెప్టెంబరు 18న ఒక తనిఖీ నివేదికే ఇచ్చారు. నీటి పరీక్షలు, కెమికల్‌ విశ్లేషణకు సంబంధించి ఒక డాక్యుమెంట్‌ కూడా ఇవ్వలేకపోయారు. దీన్ని బట్టి అసలు పరీక్షలే చేయలేదని స్పష్టమవుతోందని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వెల్లడించింది. లోడ్‌ రిజిస్టర్‌లో పాత తేదీలతో ఎంట్రీలు ఉన్నాయని... లోడ్‌ రిజిస్టర్లకు, కంప్రెసివ్‌ స్ట్రెంగ్త్‌ టెస్ట్‌ రిజిస్టర్లకు మధ్య పొంతన లేదని వివరించింది. ‘డిఫెక్ట్‌ లయబిలిటీ సమయం 2020 ఫిబ్రవరి 29 నుంచి ప్రారంభమైంది. లయబిలిటీ పీరియడ్‌లో నిర్మాణానికి సంబంధించి ఏమైనా లోపాలు వెలుగులోకి వస్తే చేపడతానని గుత్తేదారు అండర్‌టేకింగ్‌ ఇచ్చారని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తన నివేదికలో వివరించింది. పని పూర్తయినా సవరించిన పరిపాలనా అనుమతి ప్రభుత్వం నుంచి రానందున తుది బిల్లు ప్రాసెస్‌ చేయలేదని తెలిపింది.


Tags

Next Story