Mekapati Gautam Reddy: పోస్ట్‌ కోవిడ్‌ పరిణామాలే గుండెపోటుకు కారణమా

Mekapati Gautam Reddy: పోస్ట్‌ కోవిడ్‌ పరిణామాలే గుండెపోటుకు కారణమా
Mekapati Gautam Reddy: 7.45 గంటల సమయంలో ఆపస్మారక స్థితిలో ఉన్న గౌతమ్‌రెడ్డిని అపోలోకు తీసుకువచ్చారు కుటుంబసభ్యులు.

Mekapati Gautam Reddy: ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం దిగ్బ్రాంతికి గురి చేసింది. ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఇంట్లో కుప్పకూలారు. 7.45 గంటల సమయంలో ఆపస్మారక స్థితిలో ఉన్న గౌతమ్‌రెడ్డిని అపోలోకు తీసుకువచ్చారు కుటుంబసభ్యులు. గౌతమ్‌రెడ్డిని కాపాడేందుకు 90 నిమిషాలు అత్యవసర వైద్యసేవలు అందించారు. కార్డియో పల్మనరీ రిసక్సియేషన్‌-CPR చేసినా.. అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌పై ఉంచినా ఫలితం దక్కలేదు. వారం రోజుల దుబాయ్‌ పర్యటన ముగించుకొని ఆయన నిన్ననే హైదరాబాద్‌ వచ్చారు.

దుబాయ్‌ ఎక్స్‌పో వివరాలు వెల్లడించేందుకు రేపు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు గౌతమ్‌రెడ్డి. ఆ వివరాలు ప్రజలకు వివరించేందుకు ప్రెస్‌మీట్‌ కూడా ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఫిట్‌నెస్‌ విషయంలో ఎప్పుడూ శ్రద్ధ వహిస్తారు గౌతమ్‌రెడ్డి. తరచూ జిమ్‌కు వెళ్లి ఫిట్‌నెస్‌ మెయింటెన్‌ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి గుండెపోటు రావడంతో వైసీపీ నేతలంతా షాక్‌ అయ్యారు. రెండుసార్లు కరోనా నుంచి కోలుకున్నారు. అయితే... పోస్ట్‌ కోవిడ్‌ పరిణామాలే గుండెపోటుకు కారణమని అనుమానిస్తున్నారు.

గౌతమ్‌రెడ్డి మరణవార్త తెలుసుకున్న బంధువులు హుటాహుటిన హైదరాబాద్‌కు పయనమయ్యారు. రేపు ఉదయం స్వగ్రామం బ్రాహణపల్లెకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలించనున్నారు. ఎల్లుండి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రెండురోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ప్రభుత్వం.

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి దంపతులకు 1971 నవంబర్ 2న మేకపాటి గౌతమ్‌రెడ్డి జన్మించారు. గౌతమ్‌రెడ్డికి భార్య శ్రీకీర్తి, కుమార్తె అనన్యరెడ్డి, కుమారుడు అర్జున్‌రెడ్డి ఉన్నారు. గౌతమ్‌ రెడ్డి ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీలో టెక్స్‌టైల్స్‌ విభాగంలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు.

రాజకీయాల్లోకి రాకముందు కేఎంసీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వంగా 2014లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేశారు. 2014లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా 30వేల 191 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019లోనూ మళ్లీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలిచారు. మేకపాటి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో రాజకీయంగా మంచి పట్టు ఉంది.

Tags

Read MoreRead Less
Next Story