Michaung: తుఫాను ధాటికి జనజీవనం అస్తవ్యస్తం

Michaung: తుఫాను ధాటికి జనజీవనం అస్తవ్యస్తం
విరిగిపడిన చెట్లు, కరెంటు స్తంభాలు... ఉప్పొంగిన వాగులు వంకలు...

బాపట్ల సమీపంలో తీరం దాటిన తీవ్ర తుపాను మిచౌంగ్‌ తుఫాను... జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. భీకర గాలులు, జోరు వానతో తీరంపై విరుచుకుపడింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో కురిసిన కుండపోతకు జనజీవనం అస్తవ్యవస్థమైంది. రాయలసీమ జిల్లాలను సైతం మిగ్‌ జాం అతలాకుతలం చేసింది. వాగులు, వంకలు పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది. చెట్లు, కరెంట్‌ స్తంభాలు కూలి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చెట్టు మీద పడి వైఎస్సార్‌ జిల్లాలో కానిస్టేబుల్‌ మృతిచెందారు. మిగ్‌ జాం ఆంధ్రప్రదేశ్‌లో పెనునష్టంకలిగించింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాన దంచికొట్టగా వాగులు ఉప్పొంగాయి. బాపట్ల జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండగా నిజాంపట్నం మండలంలో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పెద్దపెద్ద చెట్లు నేలకొరిగాయి.పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈదురు గాలులకు పూరిళ్ల పైకప్పులు ఎగిరి పోయాయి.


ఉమ్మడి కృష్ణాజిల్లాను వర్షాలు ముంచెత్తాయి. మచిలీపట్నం మండల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శారదానగర్‌లో ఇంటి గోడ కూలింది. విజయవాడలో రోడ్లపైకి నీరు చేరింది. భానునగర్‌లో బిల్డింగ్‌ ప్లాస్టింగ్‌ కోసం కట్టిన పరంజా ఐదంతస్థుల పైనుంచి పడి..ఒక ఇల్లు పూర్తిగా, నాలుగు ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తుపాను దివిసీమపై పెను ప్రభావం చూపింది. నాగాయలంలో లోతట్టు ప్రాంతాలు చెరువుల్నితలపిస్తున్నాయి. మిగ్‌జాం ప్రభావంతో నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. నెల్లూరులో రోడ్లుపై నీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.

అల్లూరి జిల్లా జిమాడుగులకు ఉదయం సంతకు వచ్చినవారు కుంబిడిసింగి వాగు వద్ద ఇరుక్కు పోయారు. తుపాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీటి మునిగాయి. రాజమహేంద్రవరంలో ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ సంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల రేకులు ఎగిరిపడ్డాయి. పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో సుడులు ఏర్పడ్డాయి. కాకినాడ జిల్లాలో అన్నవరం రైల్వే గేటు వద్ద సుడి గుండంలా ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి.. ఆటోలు తిరగబడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్‌, కరెంట్‌ స్తంభం నేలకొరిగాయి. షెడ్డు పైకప్పు ఎగిరిపోయి ఇద్దరు గాయపడ్డారు. పంపా రిజర్వాయర్‌లో నీరు పైకి ఎగిసిపడింది. ‍‌తిరుపతి జిల్లాలో వరద ప్రభావంతో శ్రీకాళహస్తి-పల్లం రహదారిపై వాగులు పొంగి రాకపోకలు స్తంభించాయి. పాపానాయుడుపేట-చెన్నంపల్లి రహదారి... కొట్టుకుపోయింది. శ్రీకాళహస్తిలో విద్యుత్‌ ఉపకేంద్రంలో నీరు చేరి ట్రాన్స్‌ఫార్మర్లు మునిగాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి రెండు రోజులుగా కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏర్పేడు మండలం బండారుపల్లిలో సున్నపు వాగులో చిక్కుకున్న ఇద్దరిని అగ్నిమాపక, పోలీస్‌ సిబ్బంది రక్షించారు.

Tags

Next Story