మంత్రి జయరాం భూదందా నిగ్గుతేల్చేందుకు.. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ

బెంజ్ కారు వ్యవహారంలో ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి జయరాంపై తాజాగా భూదందా ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఈ విషయంలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు.. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది.. ఇందులో ఎమ్మెల్యే బీటెక్ రవి, ఎమ్మెల్సీ బీటీ.నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, కె.ఈరన్న సభ్యులుగా ఉంటారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళావెంకటరావు తెలిపారు. వైసీపీ పాలనలో ఏపీని కబ్జాల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. భూములు కబ్జా చేయడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. వైసీపీ నేతల అరాచకాలకు భయపడి పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారని కళావెంకటరావు విమర్శలు గుప్పించారు. భూములు కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారని అన్నారు.
కర్నూరు జిల్లా ఆస్పరిలో 204 ఎకరాల భూమి కోసం కంపెనీ యాజమాన్యాన్ని, అధికారులను బెదిరించి మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని కళావెంకటరావు ఆరోపించారు. దొంగ సర్టిఫికెట్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లు, షెల్ కంపెనీలతో జగన్మోహన్‌రెడ్డి కోట్లు కొల్లగొట్టిన విధంగానే... వైసీపీ నాయకులు దొంగ పత్రాలు, తీర్మానాలు సృష్టించి... భూములు కొల్లగొడుతున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆదాయం 8 లక్షల రూపాయలు అని చూపించిన మంత్రి గుమ్మనూరు జయరాం.. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 10 నెలల్లోనే 204 ఎకరాలు కొనుగోలు చేయడానికి సరిపడా డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. మంత్రి జయరాం వ్యవహారాన్ని నిగ్గుతేల్చడమే ధ్యేయంగా ఈ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు కళావెంకటరావు స్పష్టంచేశారు.
జగనన్న జేబు కత్తెర పేరిట....వైసీపీ నాయకుల కోసం సీఎం జగన్ ప్రత్యేక పథకం పెట్టారంటూ టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఎద్దేవా చేశారు. ఈ పథకం లబ్ధిదారులంతా.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులేనన్నారు. ఈ పథకంతో... రాష్ట్రాన్ని వైసీపీ నేతలు లూటీ చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న జేబు కత్తెర పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంతో మంత్రి జయరాం ముందంజలో ఉన్నారన్నారు పట్టాభి. మంత్రి జయరాం భూబాగోతాన్ని ఆధారాలతో సహా బయటపెట్టినా.. ఇప్పటివరకు సీఎం జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు పట్టాభి. జయరాం కుటుంబసభ్యులందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదైనా, అడ్డంగా దొరకినా మంత్రిని ఎందుకు కాపాడుతున్నారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com