LOKESH: ప్రజాదర్బార్ సమస్యల పరిష్కారంపై లోకేశ్ ప్రత్యేక దృష్టి

ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వస్తున్న సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రజా దర్బార్ సిబ్బందితో ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై సమస్యల పరిష్కారంలో పురోగతిని తెలుసుకుంటున్నారు. శాఖల వారీగా ఎన్ని వినతులు వచ్చాయి.. ఎన్ని పరిష్కరించాం అనే వివరాలు ఆరా తీస్తున్నారు. స్వయంగా లోకేశ్ సంబంధిత మంత్రులతో మాట్లాడుతూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. నారా లోకేష్ నిర్వహిస్తున్న ‘‘ప్రజాదర్బార్’’కు ప్రజలు భారీగా తరలివచ్చి తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా లోకేష్‌ను కలిసి విన్నపాలు అందజేశారు. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరానికి కృషిచేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేశ్
పిడుగురాళ్ల మండలం కోనంకి తండాకు చెందిన బాణావత్ లక్ష్మీదేవి భాయ్, వెంకటేశ్వర్లు నాయక్లకు మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. వారిని శుక్రవారం ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని ఆర్థిక సాయం అందించి భరోసానిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో లక్ష్మీదేవి, వెంకటేశ్వర్లను వైసీపీ నేతలు వేధింపులకు గురిచేసినా.. ఎక్కడా భయపడకుండా తమ ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేశారని లోకేశ్ చెప్పారు.
రెడ్‌బుక్ పాలన ఆరంభమైందన్న లోకేశ్
రెడ్ బుక్ పై లోకేష్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీలో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రెడ్‌బుక్‌లో పేరు ఉందని కొందరు వైసీపీ నేతలు భయపడుతున్నారని, భూకబ్జాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. ఇక, మాజీ సీఎం జగన్ జిల్లాల పర్యటనకు వెళితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతినిస్తామని, కానీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. విజయవాడ వరదలు, వరద సాయం, నిధులు, ఖర్చు, కూటమి ప్రభుత్వంపై ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వరదల సమయంలో జగన్ అడుగు బయటపెట్టలేదని, కానీ, వరద సాయంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి సాధించడంలో, రాష్ట్రానికి పెట్టుబడుల తెచ్చే విషయంలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడాలని అన్నారు.గత ప్రభుత్వానికి భయపడి ఏపీలో పెట్టుబడులు పెట్టకుండా వెళ్లిన వారిని వెనక్కి తెచ్చే బాధ్యత తమదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com