MITHUN REDDY: రాజమండ్రి జైలుకు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి

ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు తిరిగింది. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి కోర్టు 14 రోజు రిమాండ్ విధించింది. మద్యం కుంభకోణంపై సిట్ 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. దీనితో పాటు వందకు పైగా ఫొరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలను జతచేశారు. మొత్తం రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 268 మంది సాక్షులను విచారించినట్లు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మిథున్‌రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. మిథున్‌రెడ్డిని శనివారం సిట్ అధికారులు అరెస్టు చేశారు. అంతకు ముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధరించడంతో అధికారులు ఆయన్ను ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరు పర్చారు. మిథున్‌రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. సెక్షన్ 409, 420, 120(బీ), రెడ్‌విత్ 34, 37, ప్రివెన్షన్ ఆప్ కరెప్షన్ యాక్టు 7, 7ఏ, 8, 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది.
ఆగస్టు 1 వరకు రిమాండ్
సిట్ తరఫున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని సిట్ తరఫు న్యాయవాది కోరారు. మిథున్‌రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని, రిమాండ్ విధిస్తే భద్రత దృష్ట్యా నెల్లూరు జైలులో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. మిథున్‌రెడ్డి ప్యానెల్ స్పీకర్‌గా పనిచేశారని, ఆయన అరెస్టుపై స్పీకర్‌కు సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
2019 నుంచి 2024 వరకు ఏపీలో మద్యం ధరలను అనూహ్యంగా పెంచి తద్వారా డిస్టలరీల నుంచి ముడుపులను కిక్ బ్యాగ్స్ రూపంలో సేకరించినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అనుచిత లబ్ధి పొందేందుకు ఈ కుంభకోణంలో కిక్ బ్యాగ్స్ తీసుకున్నట్లు సిట్ వెల్లడించింది. అధికార దుర్వినియోగం చేసి మద్యం విధానాన్ని మార్చి నిధుల దుర్వినియోగానికి పాల్పడి రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగించారని రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు. లిక్కర్ వ్యవహారంలో ఫోర్జరీ, చీటింగ్ చేసి న్యాయవిరుద్దంగా వ్యవహరించారని... నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం, అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగులను లొంగ తీసుకున్నారని పేర్కొన్నారు. బహుళజాతి కంపెనీల బ్రాండ్లను పక్కకు తప్పించి, స్వంత లోకల్ బ్రాండ్లను తయారు చేయించి కొనుగోలు చేశారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో ముడుపులు అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చేరడానికి ముందు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా మిథున్ రెడ్డికి వచ్చాయని సిట్ పేర్కొంది. డిస్టలరీల నుంచి మద్యం తీసుకునేందుకు ఆర్డర్ ఆప్ సప్లై కూడా మ్యానువల్‌గా చేశారని.. ఇందులో కూడా మోసం ఉందని సిట్ వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com