ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష

ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆంధ్రా పేపర్‌ మిల్‌ కార్యాలయంలో ఆమరణ దీక్ష చేపట్టారు.. గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.. ఆంధ్రా పేపర్‌ మిల్‌ యాజమాన్యంతో ఈ విషయమై చర్చించినా మొండి వైఖరి వీడటం లేదని మండిపడ్డారు.. వైసీపీ సిటీ కోఆర్డినేటర్‌ శివరామ సుబ్రహ్మణ్యం, సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్‌, కార్మిక సంఘాల నేతలు పేపర్‌ మిల్‌ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆమరణ దీక్షకు దిగారు.

2019 జనవరి ఏడున పేపర్‌ మిల్‌ యాజమాన్యానికి, ఆనాటి గుర్తింపు సంఘానికి మధ్య ఒప్పందం జరిగింది. కాంట్రాక్టు కార్మికులు 84 మందిని ఇన్‌ప్లాంట్‌ ట్రైనీలుగా, 55 మందిని బదిలీలుగా సీనియారిటీ ఆధారంగా తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు.. దాంతోపాటు కోర్‌ విభాగాల్లో 55 మందిని సీనియారిటీ ఆధారంగా పర్మినెంట్‌ చేసేలా ఒప్పందం జరిగింది.. అయితే, యాజమాన్యం ఆ ఒప్పందాన్ని అమలు చేయకుండా తాత్సారం చేస్తూ వచ్చింది.. చివరకు ఈ ఏడాది జనవరిలో ఒప్పందానికి భిన్నంగా సీనియారిటీని పక్కనపెట్టి అడ్డగోలుగా ఆర్డర్లు ఇచ్చింది.. దీనిపై కాంట్రాక్టు కార్మికులు తిరుగుబాటు చేశారు.. కార్మికుల పోరాటానికి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ సిటీ కోఆర్డినేటర్‌ శివరామ సుబ్రహ్మణ్యం, సీపీఎం నాయకులు, ఇతర కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి.. దీంతో దిగివచ్చిన యాజమాన్యం నాడు డీసీఎల్‌ సమక్షంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత అనేకసార్లు కార్మిక శాఖ అధికారుల వద్ద సమస్య పరిష్కారానికి ప్రయత్నించినా యాజమాన్యం మొండిగా వ్యవహరించి కాలయాపన చేస్తూ వచ్చింది. సెప్టెంబరు 30న ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతోపాటు కార్మిక నేతలు, ఇతర యూనియర్లు చర్చలు జరపగా.. అక్టోబరు 15 నాటికి ప్రక్రియ పూర్తిచేస్తామని యాజమాన్యం చెప్పింది. కానీ, మిల్‌ లోపల మళ్లీ యూనియన్లతో మీటింగ్‌ జరిపి 50 ఏళ్లు వయసు దాటిన వారిని, మహిళలను, సెక్యూరిటీ కార్మికులను తీసుకోబోమని, ఇంకా అనేక షరతులు పెట్టింది. మరోసారి కార్మికులను మోసం చేసేందుకు పేపర్‌ మిల్‌ యాజమాన్యం ప్రయత్నించడం వివాదాస్పదమైంది.

కార్మికుల పోరాటానికి మద్దతుగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సీపీఎం జిల్లా కార్యదర్శి అరున్‌ చేస్తున్న దీక్షలకు స్థానిక నాయకులు, పలువురు ప్రముఖులు సంఘీభావం ప్రకటించారు.. కార్మిక శాఖ, ప్రభుత్వ అధికారుల వద్ద అంగీకరించిన అంశాలను కూడా అమలు చేయకుండా నిరంకుశంగా వ్యవహరించడం సరికాదని వారన్నారు.. తక్షణమే కార్మికులకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Tags

Next Story