MLC: ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ల పరిశీలన అనంతరం తెలంగాణలో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ పోటీలో ఉన్నారు. ఇక ఏపీ నుంచి బీటీ నాయుడు, గ్రీష్మ, బీదా రవిచంద్ర, సోము వీర్రాజు, నాగబాబు నామినేషన్లు సమర్పించారు. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా అదే రోజు సాయంత్రం ఈసీ ప్రకటన వెలువరించనుంది. ఇండిపెం డెంట్ల నామిషన్లు నిబంధనలకు లోబడి లేకపోవడంతో ప్రధాన పార్టీలకు చెందిన ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నిక లాంఛనం కానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో...
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. ఐదు స్థానాలకు కూటమి పార్టీల నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన నుంచి నాగబాబు.. టీడీపీ తరఫున బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ.. బీజేపీ నుంచి సోము వీర్రాజు నామపత్రాలు దాఖలు చేశారు. మంగళవారం వాటిని పరిశీలించారు. సాంకేతికంగా నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉండడంతో ఆ తర్వాత వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. వీర్రాజును బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు బలపరిచారు. నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలంగాణలో
ఈ నెల 29తో పదవీకాలం ముగియనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. ఐదు స్థానాలకుగాను బీఆర్‌ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, కాంగ్రెస్, మిత్రపక్షమైన సీపీఐ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్, సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమమైనవిగా తేలింది. గురువారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నిక అయినట్టు ప్రకటిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com