విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ముమ్మరంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని అన్నారు. వాటిని బలోపేతం చేసేందుకు ఆర్థిక సాయం అందించడం భారమని వ్యాఖ్యానించారు. నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజాధనంతో నడుస్తున్నాయని చెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు.
వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వ్యాపార రంగానికి ప్రభుత్వం తనవంతు తోడ్పాటునందిస్తుందని చెప్పారు. ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని వివరించారు. సంపద సృష్టి, ఆధునికీకరణ నినాదంతో ముందుకెళ్లుతున్నామని మోదీ చెప్పారు. ప్రభుత్వం వైదొలిగే రంగాలను ప్రైవేటు రంగం భర్తీ చేస్తుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించినప్పటి పరిస్థితులు వేరు అని.. 50-60 ఏళ్లనాటి విధానాల్లో సంస్కరణలు అవసరమన్నారు. ప్రజాధనం సద్వినియోగమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు ప్రధాని మోదీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com